వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ ప్రభుత్వం 2020లో తీసుకువచ్చిన చట్టానికి విరుద్ధంగా ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో 121 ఉందంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. వీఆర్‌వో వ్యవస్థ రద్దు ప్రభుత్వ విధాన నిర్ణయమని, దీనిపై తాము ఎలాంటి వ్యాఖ్య చేయడంలేదంది. కానీ, వారి సర్దుబాటుకు జారీ చేసిన జీవోలోని అంశాలు ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టానికి విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. జీవోలోని 3వ పేరాలో అంశాలు చట్టంలోని సెక్షన్ 4(1)కు విరుద్ధంగా ఉన్నాయని చెప్పింది.
నిబంధనలు రూపొందించకుండా.. అదీ ఆర్థికశాఖ ఇచ్చిన జీవో ద్వారా కీలకమైన వీఆర్‌వో పోస్టులను రద్దు చేశారని హైకోర్టు వెల్లడించింది. ప్రాథమికంగా చట్టానికి విరుద్ధంగా ఉందంటూ జీవో 121 అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు సర్దుబాటు చేయని వీఆర్‌వోలను రెవెన్యూ శాఖలోనే కొనసాగించి వేతనాలు చెల్లించాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
జీవో 121ను సవాలు చేస్తూ తెలంగాణ వీఆర్‌వో రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు జి.సతీష్ మరొకరు దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సి.వి.భాస్కర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది పి.వి.కృష్ణయ్య వాదనలు వినిపిస్తూ వీఆర్‌వో వ్యవస్థ రద్దుకు చట్టం చేశారు.. కానీ నిబంధనలు రూపొందించలేదన్నారు. వీఆర్‌వోలుగా ఉన్నవారు ఎక్కువ శాతం మంది తమకు అనుభవం ఉన్న రెవెన్యూ శాఖలోనే కొనసాగాలని కోరుకుంటున్నారని అన్నారు.
నిబంధనలు రూపొందించారా అన్న ధర్మాసనం ప్రశ్నకు అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ సమాధానమిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారమే వీఆర్‌వోల బదలాయింపు జరుగుతోందన్నారు. 5 వేలకుపైగా ఉన్న వీఆర్‌వోల్లో 98.90 శాతం ఇతర శాఖలకు చెందిన విధుల్లో చేరిపోయారని తెలిపారు. కేవలం 56 మంది మాత్రమే ఇంకా చేరకపోగా రెవెన్యూ శాఖలోనే ఉంటామనడం సరికాదని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ధరణిని తీసుకువచ్చిందని, కొత్త యంత్రాంగాన్ని అమలు చేస్తున్నందున వీఆర్‌వోలకు ఈ శాఖలో పని ఉండదని కోర్టుకు వివరించారు.
దీనిపై ధర్మాసనం స్పందిస్తూ నిబంధనలు రూపొందించకుండా జీవో 121 ద్వారా బదలాయింపు సరికాదంది. జీవో ప్రకారం ఇప్పటివరకు వెళ్లనివారిని అదే శాఖలో కొనసాగనివ్వాలని ఆదేశిస్తూ ఉత్తర్వుల అమలుపై స్టే విధించింది. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను వాయిదా వేసింది.