దసరా లోపు రైతుబంధు పడకపోతే వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు మాజీ మంత్రి హరీష్ రావు. దసరా తర్వాత రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో రైతులు చేపట్టిన ధర్నాలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుంటిసాకుతో రుణమాఫీ ఎగ్గొట్టి, ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు.
ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రవ్యాప్తంగా రైతు రుణమాఫీని భేషరతుగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తానని చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రైతు డిక్లరేషన్ లో ఏ ఒక్క హామీ అమలు కాలేదని ఎద్దేవా చేశారు.
అంతేకాదు రాష్ట్రంలో రౌడీ రాజ్యం అమలవుతుందని మండిపడ్డారు. మూతపడిన షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని, పసుపు బోర్డును తీసుకువస్తామంటూ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అలాగే భూమిలేని నిరుపేద రైతులకు ఐదు లక్షల రైతు బీమా పత్తా లేకుండా పోయిందని ఆరోపించారు. దసరా లోపు ప్రభుత్వం రైతుబంధు నిధులు జమ చేయాలని డిమాండ్ చేశారు.