జైలుకు పంపితే యోగా చేసుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ రేసింగ్ విషయంలో తనపై ఆరోపణలు చేస్తున్న వేళ తాజాగా తెలంగాణ భవన్ లో కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసు పెడితే పెట్టండి.. నన్ను అరెస్ట్ చేస్తే చేసుకోండి. నాకేం ఫరక్ పడదు. ఓ రెండు నెలలు, మూడు నెలలో జైలులో పెట్టి పైశాచికానందం పొందుతానంటే నాకేం అభ్యంతరం లేదు. జైలులో యోగా చేసుకొని బయటికి వచ్చాక పాదయాత్ర చేస్తా అన్నారు.
ఏసీబీ నుంచి నాకు ఎలాంటి నోటీసు రాలేదు. అటెన్షన్, డైవర్షన్ సీఎం రేవంత్ రెడ్డి ఇవన్నీ చేస్తున్నారు. నా మీద ఎందుకు కేస్ పెడతారు..? హైదరాబాద్ ను అంతర్జాతీయంగా పేరు తెచ్చినందుకు పెడతావా? లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకా? బెంగళూరు కన్నా ఐటీ ఎగుమతులను పెంచినందుకా? ఇక్కడి యువతకు ఉద్యోగాలు కల్పించినందుకా? ఎందుకు కేసు పెడతావు అని ప్రశ్నించారు. సీఎం రేవంత్.. హైదరాబాద్ ఇమేజ్ నీ వల్ల దెబ్బతింటోంది. సిగ్గు తెచ్చుకో అంటూ ఘాటుగా స్పందించారు కేటీఆర్.