మహాలక్ష్మి స్కీమ్.. ‘జీరో’ టికెట్ల జారీపై తనిఖీలకు ఆదేశాలు

-

తెలంగాణ సర్కార్ ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకానికి భారీగా ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ బస్సుల్లో రద్దీ బాగా పెరుగుతోంది. బస్సులు సరిపోకపోవడంతో మరికొన్ని రోజుల్లో ఇంకొన్ని బస్సులను ఏర్పాటు చేస్తామని ఇటీవలే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు.

అయితే తమ డిపోలో 97 శాతం, 100 శాతం ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్‌- సీట్ల భర్తీ నిష్పత్తి) నమోదవుతోందని కొందరు డిపో మేనేజర్లు ఇస్తున్న నివేదికలపై ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా ఓఆర్ ఎలా పెరిగిందని సందేహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహిళలకు జారీచేసే ‘జీరో’ టికెట్లపై తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.

కొందరు కండక్టర్లు బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలకంటే ఎక్కువగా సంఖ్యలో ‘జీరో’ టికెట్లు ప్రింట్‌ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘జీరో’ టికెట్ల జారీ విషయమై తనిఖీలు చేయాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించి కొన్ని జిల్లాల్లోని రూట్లలో శనివారమే తనిఖీలు ప్రారంభించింది. హైదరాబాద్‌ సిటీ బస్సుల్లోనూ రెండు, మూడు రోజుల్లో తనిఖీలు నిర్వహించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version