టీడీపీకి అత్యంత కీలకమైన జిల్లా కర్నూలులో ఆ పార్టీ నేతలు మౌనంగా ఉన్నారు. ఎవ్వరూ కూడా ముందుకు రావడం లేదు. పైగా.. ఎవరూ కూడా యాక్టివ్‌గా లేకపోవడంపై పార్టీలోనే చర్చకు దారితీస్తోంది. కీలకమైన నాయకులు కేఈ కృష్ణమూర్తి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, భూమా కుటుంబం సహా అనేక మంది నేతలు ఉన్నా.. ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదు. అడపాదడపా.. భూమా అఖిల ప్రియ పార్టీ తరఫున మాట్లాడుతున్నా.. ఆమెపై కేసులు పెట్టడంతో ఆమె కూడా ఇటీవల మాట్లాడడం తగ్గించారు. ఇక, గత ఎన్నికల్లో టికెట్ పొంది ఓడి పోయిన కేఈ కుమారుడు శ్యాం బాబు కూడా దూకుడు ప్రదర్శించలేక పోతున్నారు.
కర్నూలు నగర పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న టీజే వెంకటేష్ కుమారుడు టీజీ. భరత్ కూడా మౌనంగానే ఉండడం గమనార్హం. ఇక, భూమా అఖిల ప్రియ ఒత్తిడితో టికెట్ తెచ్చుకుని 2017 ఉప పోరులో గెలుపు గుర్రం ఎక్కిన భూమా బ్రహ్మానందరెడ్డి కూడా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. వాస్తవానికి ఆయన గత ఏడాది ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత.. తనకు గెలుపు ఓటములతో సంబంధం లేదని పార్టీ కోసం పోరాడతానని చెప్పారు. కానీ, ఇప్పటి వరకు ఆయన కూడా మౌనంగానే ఉన్నారు. కోట్ల కుటుంబం అసలు పార్టీలో ఉండాలా ? వద్దా? అనేలా నిర్ణయం తీసుకున్న సమయంలో తాజాగా పార్టీ పదవుల్లో అవకాశం ఇచ్చారు. అయితే, తమకు ఈ పదవులతో అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించినట్టు సమాచారం.
పాణ్యం నుంచి టీడీపీలో చేరిన గౌరు చరితారెడ్డి కూడా బీజేపీవైపు చూస్తున్నారు. ఆమె భర్తకు పార్టీలో పదవి ఇచ్చినా.. ఆయన కూడా అసంతృప్తితోనే ఉన్నారు. పార్టీ కోసం ఖర్చు చేయాలి.. శ్రమించాలి.. తిరిగి వేరేవారికిపదవులు ఇస్తారు.. అంటూ ఆయన నిట్టూర్పులు విడుస్తున్నారు. మరోవైపు.. యువ నేతలు కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉండడం గమనార్హం.
ఈ పరిణామాలతో పార్టీ పరిస్థితి ఏంటి ? ఎలా ముందుకు తీసుకువెళ్తారు ? అసలు ఇక్కడ అసంతృప్తికి కారణం ఏంటి ? అనే అంశాలపై ప్రత్యేకంగా చర్చ జరుగుతుండడం గమనార్హం. ఏదేమైనా.. అత్యంత కీలకమైన జిల్లా కర్నూలులో పార్టీ పరిస్థితి ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నచందంగా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తుండడం గమనార్హం.