కరోనా మహమ్మారితో మరణించిన వారిలో వృద్ధులే అధికం. 60 ఏళ్లకు పైబడిన వారే ఎక్కువగా మరణిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే.. కేరళలో ఓ శతాధిక వృద్ధుడు కరోనాను ఓడించాడు. 103 ఏళ్ల వయసులోనూ.. కేవలం 20 రోజుల్లోనే వైరస్ నుంచి కోలుకుని ఔరా అనించాడు. తిరువనంతపురం జిల్లా అలువకు చెందిన పరీద్ (103) జులై 28న తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడగా.. పరీక్షలు నిర్వహించారు. కరోనా సోకినట్లు నిర్ధరించారు వైద్యులు. అనంతరం ఎర్నాకులంలోని కలమస్సెరీ వైద్య కళాశాలకు తరలించారు. వయస్సు పైబడిన నేపథ్యంలో ప్రత్యేక వైద్య బృందం పరీదుకు చికిత్స అందించింది.ఆసుపత్రిలో చేరిన 20 రోజుల్లోనే కరోనా నుంచి కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. పరీదును మంగళవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు.
రాష్ట్రంలో ఇటీవల వైరస్ నుంచి పలువురు వృద్ధులు కోలుకున్నారు. కొల్లాంలోని పరిప్పల్లీ వైద్య కళాశాలలో చేరిన అంచాల్కు చెందిన అస్మా బీవి (105) వైరస్ను జయించారు. అలాగే.. కొట్టాయం వైద్య కళాశాలలో చేరిన 93, 88 ఏళ్ల వృద్ధ దంపతులు కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.