ఇప్పుడున్న అన్ని పార్టీలకు కూడా కుల పరమైన మెజార్టీ లేదా అండ ఉంటేనే ఏ పార్టీకి మనుగడ సాధ్యం. లేదంటే మాత్రం అధికారం కూడా కోల్పోతుంది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో టీడీపీకి ఉన్న చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జాతీయ పార్టీల హవా సాగుతున్న సమయంలో ప్రాంతీయ పార్టీని పెట్టి ప్రజల్లోకి తీసుకెళ్లారు ఎన్టీఆర్. ఆయన టీడీపీని పెట్టినప్పటి నుంచి మొదలుకుని పార్టీకి బీసీ సామాజిక వర్గమే మద్దతుగా ఉంటోంది. వారి సపోర్టుతోనే ఆయన అధికారంలోకి వచ్చారు. కానీ ఎన్టీఆర్ దూరమయ్యాక ఆ పరిస్థితి లేదు.
ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు పార్టీని ఆయన చేతుల్లోకి తీసుకున్నారో అప్పటి నుంచి బీసీలు టీడీపీకి దూరమవ్వడం మొదలు పెట్టారు. బీసీలు దూరం కావడంతో గత ఎన్నికల సందర్భంగా టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ల కేటాయింపు నుంచి మొదలు కుని ప్రతి విషయంలో బీసీలను పక్కన పెట్టడంతో వారంతా కూడా దూరంగా ఉన్నారు. ఇక వీరిని జగన్ మోహన్ రెడ్డి పెద్దపీట వేసి తనవైపు తిప్పుకున్నారు.
వైసీపీ నుంచి ఎక్కువ టికెట్లు వారికే ఇవ్వడంతో పాటు మంత్రి పదవుల్లో కూడా బీసీలకు ప్రముఖ స్థానం కల్పించి ఎక్కువ సీట్లు కేటాయించారు. దీంతో బీసీల్లో చాలా వరకు చీలికలు వచ్చి వైసీపీకి అది ప్లస్ అయింది. కానీ టీడీపీ ఇప్పటి వరకు కూడా బీసీల గురించి పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయట్లేదు. అధికారంలో ఉన్నప్పుడు కూడా బీసీ వర్గాలను పెద్దగా పట్టించుకోలేదు. బీసీ కార్యకర్తలను, బీసీ వర్గాలకు సంబంధించిన పనులపై పెద్దగా పట్టింపు లేకుండా ఉండటంతో వారంతా దూరమయ్యారు. ఇప్పటికైనా వారికి సంబంధించిన పనుల్లో చురుగ్గా వ్యవహరిస్తే వారు మల్లీ పార్టీ వైపు వచ్చే ఛాన్స్ ఉంది.