తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేసింది పాలించడానికా.. లేదా గూండాయిజం చేయడానికా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లాలో ఎంపీ అరవింద్ పై చేసిన దాడిని ఆయన ఖండించారు. నల్లగొండ బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఎంపీ అరవింద్ పై టీఆర్ఎస్ గుండాలు, పోలీసులు కలిసి దాడి చేశారని ఆరోపించారు. ఈ ఘటన పై డీజీపీతో మాట్లాడలని ప్రయత్నిస్తే.. తన ఫోన్ ను లిఫ్ చేయడం లేదని అన్నారు. అలాగే సీపీ కూడా తన ఫోనును లిఫ్ట్ చేయడం లేదని అన్నారు.
తెలంగాణ డీజీపీని టీఆర్ఎస్ నేతలే నడిపిస్తున్నారని ఆరోపించారు. హోం గార్డును బదిలీ చేసే కనీస అధికారం కూడా డీజీపీకీ లేదని విమర్శించారు. అలాగే ఖమ్మం జిల్లాలో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యలు.. ఇప్పుడు ఉద్యోగం కోసం ఆత్మహత్యలు ఆగడం లేదని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ డిప్రెషన్ లో ఉన్నారని అన్నారు. కేసీఆర్ అవినితి చిట్టా బయటకు తీస్తామని తెలిపారు. ఈఎస్ఐ స్కాంలో కేసీఆర్ అవినితి చేయలేదని చెప్పగలరా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను త్వరలోనే జైలుకు పంపిస్తామని అన్నారు.