వారికే తొలుత ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది : సీఎం రేవంత్ రెడ్డి

-

కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు ప్రాంతాన్ని ప్రత్యేక జోన్‌గా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. గీసుకొండ మండలం శాయంపేటలోని మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను సిఎం సందర్శించారు.వన మహోత్సవంలో భాగంగా మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో ముఖ్యమంత్రి మొక్కలు నాటారు. అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ సందర్శించారు. అనంతరం పార్క్ పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. టెక్స్‌టైల్ పార్కుకు భూములిచ్చిన వారికి తొలుత ఇళ్ల స్థలాలు మాత్రమే ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే ప్లాట్లతో పాటు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించే సాధ్యాసాధ్యాలపై పరిశీలించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేశించారు.

1,200కు పైగా ఇళ్లను నిర్మిస్తే గ్రామ పంచాయతీగా డిక్లేర్ చేసే అవకాశం ఉంటుందని అన్నారు. టెక్స్‌టైల్ పార్కు సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కైటెక్స్, యంగ్ వన్ సంస్థ ప్రతినిధులతో సీఎం మాట్లాడారు. మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు సమీపంలో వరద నీటిని స్టోర్ చేసేలా పది ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో చెరువును ఏర్పాటు చేయాలని ,టెక్స్‌టైల్ పార్కుకు సమీపంలో వచ్చే వరద నీటిని ఈ చెరువులోకి మళ్లించి వాటిని స్టోర్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ చెరువును స్థానికంగా ఉండే ఇతర చెరువులతో లింక్ చేయడం ద్వారా వరద నీటికి పరిష్కారంతో పాటు టెక్స్‌టైల్‌ పార్క్‌కు అవసరమైన నీటి లభ్యతను సాధించే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version