పెళ్ళయ్యాక చాలామంది అడిగే ప్రశ్న, శుభవార్త ఎప్పుడు చెబుతావని. పదే పదే ఇదే ప్రశ్న అడిగి విసిగిస్తుంటారు. ఇక పెళ్ళై రెండు మూడు సంవత్సరాలైతే చాలు సలహాలిస్తూ చంపేస్తుంటారు. వాళ్ళ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాల్సిన పనిలేదు కానీ, మీరు పిల్లలు కనడానికి సిద్ధంగా ఉన్నారా? ఆ విషయం మీకెలా తెలుస్తుంది తదితర విషయాలు ఇక్కడ చర్చిద్దాం.
ఇతరుల పిల్లలని చూసి ఉత్తేజం పొందడం
చిన్నపిల్లలు ఆడుకుంటుంటే చూసి, అబ్బా ఎంత బాగున్నారని ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవడం, వారిని ఆడించడం, వారిని చూడగానే మీలో ఏదో వెలుగు వెలిగినట్లు అనిపిస్తుంటే మీరు పిల్లలు కనడానికి సిద్ధంగా ఉన్నట్లే.
ఊహలు
మా పాప ఇలా ఉండాలి. మా పాప అలా ఉండాలి. అచ్చం మా ఆయనలాగే ఉండాలి. లేదా నాలా ఉండాలి వంటి ఊహలు మీకు ఎక్కువగా కలుగుతున్నాయంటే మీరు సంతానానికి రెడీగా ఉన్నట్టే.
కలలు
తరచుగా మీ కలల్లో మీకు పాప పుట్టినట్లు, వారిని ఆడించినట్లు, వారు ఏడిస్తే జోలపాడినట్లు, బుజ్జగించినట్లు వస్తుంటే మీరు పిల్లలు కావాలని కోరుకుంటున్నట్లే లెక్క. కలలో వచ్చేవి తొందరగా నిజం కావాలని గట్టిగా కోరుకుంటారు.
పేర్లు
పాప పుడితే ఎలాంటి పేరు బాగుంటుంది? ఏ పేరు పెట్టాలి అనే విషయంలో తరచుగా ఆలోచిస్తుంటారు. మీకు నచ్చిన పేర్లని ఒక పుస్తకంలో నోట్ చేసుకుంటారు. పాప పుడితే అలా, బాబు పుడితే ఇలా అని పేర్లను కలెక్ట్ చేస్తూ ఉంటారు.
ఇలాంటి సంకేతాలు మీలో కనిపించినపుడు మీరు పిల్లల్ని కనడానికి సిద్ధంగా ఉన్నట్లే అని అర్థం చేసుకోవాలి.