తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర పోస్టర్ ని విడుదల చేశారు బిజెపి నేతలు. ఈ పాదయాత్ర ఆగస్టు 2 నుంచి 26 వ తేదీ వరకు సాగనుంది. ఈ మూడో విడత పాదయాత్ర ఇన్చార్జిగా మనోహర్ రెడ్డిని నియమించారు. ఆగస్టు 2న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి ఈ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ ప్రారంభ కార్యక్రమానికి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ను ఆహ్వానించారు.
యాత్రకి అనుమతి ఇవ్వాలని బిజెపిని కలిసామని తెలిపారు మనోహర్ రెడ్డి. మొత్తం 24 రోజులపాటు యాదాద్రి, నల్గొండ, జనగామ, వరంగల్, హనుమకొండ జిల్లాల మీదుగా 12 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 మండలాల్లో సాగనుంది. మొత్తం 328 కిలోమీటర్ల మేర మూడవ విడత పాదయాత్ర కొనసాగుతోంది. ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, పాలకుర్తి, స్టేషన్ ఘనపూర్, జనగామ, వర్ధన్నపేట, పరకాల, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర సాగుతుందని ఆ పార్టీ నేతలు తెలిపారు.
ఆగస్టు 7న చేనేత దినోత్సవం సందర్భంగా కేంద్ర చేనేత మంత్రిని ఆహ్వానిస్తున్నట్లుగా తెలిపారు. ఆగస్టు 26న వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో రెండు లక్షల మందితో ముగింపు బహిరంగ సభను భారీగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.