ఉత్తర కొరియా ఏ క్షణంలోనైనా అణు పరీక్ష నిర్వహించవచ్చని అమెరికా అధికారులు హెచ్చరిక జారీ చేశారు. ఉత్తర కొరియా ఇటీవలే వరుసగా 8 క్షిపణులను పరీక్షించిన విషయం తెలిసిందే. త్వరలో అణు పరీక్షకు సిద్ధం కానున్నట్లు ఉత్తరకొరియా వ్యవహారాల ప్రధాన ప్రతినిధి సుంగ్‌కిమ్ గతంలో ప్రకటించారు. దీంతో అమెరికా అప్రమత్తమైంది. ఉత్తర కొరియాలో టాక్టికల్, చిన్న సైజు అణ్వస్త్రాలు వాడేందుకు సానుకూలంగా ఉన్నట్లు అర్థమవుతోంది. ఈ వారంలోనే అణు పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం.
ఈ విషయంపై అమెరికా డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ వాన్డీ షెర్మన్ స్పందించారు. ఉత్తర కొరియా అణుపరీక్ష తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటోందని హెచ్చరించారు. ఏ అణు పరీక్షకు అయినా ఐరాస పూర్తి వ్యతిరేకమన్నారు. కాగా, ఐదేళ్ల నుంచి ఉత్తర కొరియా ఎలాంటి అణు పరీక్షలు నిర్వహించలేదు. కానీ ఇటీవల భారీ ఎత్తున క్షిపణి పరీక్షలు నిర్వహించింది. 2019లో 25 పరీక్షలు నిర్వహించగా.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 33 క్షీపణి పరీక్షలు నిర్వహించింది. దీంతో ప్రపంచ దేశాలు ఉత్తర కొరియా తీరును వ్యతిరేకిస్తున్నాయి.