కూతురితో పెళ్లికి నిరాకరించిందని యువతి తల్లిపై ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఆమె గొంతు నులిమి హత్య చేసేందుకు యత్నించాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో ఆదివారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది.
మండలంలోని వన్నారానికి చెందిన రాజ్ కుమార్ అదే గ్రామానికి చెందిన ఓ యువతిని పెళ్లిచేసుకుంటానని వెంట పడ్డాడు. విషయం తెలిసిన యువతి తల్లి.. కూతురికి వేరే వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిర్చింది.ఈ విషయం తెలిసి ఆగ్రహించిన రాజ్‌కుమార్ యువతి తల్లిపై దాడికి పాల్పడటంతో పాటు గొంతు నులిమి హత్య చేసేందుకు యత్నించాడు. బాధితురాలి కూతురు, స్థానికులు ఆమెను దుండగుడి నుంచి రక్షించారు. అనంతరం యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు యువకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.