దక్షిణాఫ్రికాతో భారత్ పోటీపడిన నాలుగవ టి-20 మ్యాచ్ లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు ఆవేశ్ ఖాన్. మొదటి మూడు టి-20 మ్యాచుల్లో ఒక్క వికెట్ తీయకపోయినా.. నాలుగవ టి-20 లో మాత్రం 18 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. అయితే తన అద్భుత ప్రదర్శన క్రెడిట్ అంతా చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కి దక్కుతుందని ఆవేశ్ ఖాన్ ప్రకటించడం గమనార్హం.
తాను మొదటి మూడు మ్యాచుల్లో ఒక్క వికెట్ తీయకపోయినా రాహుల్ సార్ తనకు మద్దతుగా నిలిచినట్లు ఆవేశ్ ఖాన్ చెప్పుకొచ్చాడు.” నాలుగు మ్యాచుల్లోనూ జట్టును ఏమాత్రం మార్పు చేయలేదు. కనుక ఈ క్రెడిట్ అంతా రాహుల్ ద్రవిడ్ సార్ కే చెందుతుంది. ఒకటి రెండు మ్యాచుల్లో చెత్త ప్రదర్శన తర్వాత ఆటగాడిని ఆయన మార్చరు. ఎందుకంటే ఒకటి,రెండు గేమ్ లతో ఆటగాడి ప్రతిభను గుర్తించడం సాధ్యం కాదు. ప్రతి ఒక్కరూ తాము ఎంతో నిరూపించుకునేందుకు తగినన్ని మ్యాచుల్లో ఆడించాలి.
దక్షిణాఫ్రికాతో మొదటి మూడు రోజుల్లో ఒక్క వికెట్ కూడా తీయకపోవడంతో నాపై ఒత్తిడి ఉంది. కానీ రాహుల్ సర్, జట్టు యాజమాన్యం నాకు మరో అవకాశం ఇచ్చింది. దాంతో నాలుగు వికెట్లు తీయగలిగాను. మా నాన్న పుట్టిన రోజు కావడంతో ఆయనకు దీన్ని బహుమతిగా ఇస్తున్నాను.” అని ఆవేశ్ ఖాన్ పేర్కొన్నాడు.