గౌరవెల్లి ప్రాజెక్టులో నీళ్లు కాకుండా నిర్వాసితుల రక్తాన్ని ప్రవహింపచేస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని.. కానీ నిర్వాసితులకు న్యాయంగా రావాల్సిన పరిహారం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. కొంతమంది యువకులను లక్ష్యంగా చేసుకొని పోలీసులు తలలు పగలాగోట్టారని ఆరోపించారు. మహిళలు, బాలికలు అని చూడకుండా గౌరవెల్లి నిర్వాసితుల పై పోలీసులు క్రూరంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మానవ హక్కుల కమిషన్(HRC)కి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
గౌరవెల్లి భూనిర్వాసితులు, సర్పంచులను వెంట తీసుకొని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిశారు. మరోవైపు రాష్ట్రంలో సర్పంచులు, ఎంపీటీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు బండి సంజయ్ తెలిపారు. బిల్లులు రాకపోవడంతో కొందరు ప్రజాప్రతినిధులు బిచ్చమెత్తుకుంటున్నారని వాపోయారు. మరికొందరు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం తమిళిసై కి చెప్పామని వెల్లడించారు.