అక్కడ పక్షులు ఆత్మహత్య చేసుకుంటాయి…కారణం తెలియక శాస్త్రవేత్తల తిప్పలు..!

-

ఈ భూమ్మీద జీవించే హక్కు ప్రతి జీవికి ఉంది. కానీ మనుషులే బతకలేక, కష్టాలను సాకుగా చూపిస్తూ ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆత్మహత్య మహాపాపం అని మతాలు, చట్టాలు చెబుతున్నా..వచ్చిన కష్టం ముందు ఆత్మహత్య తప్ప వేరే శరణ్యం లేదనుకుని మనుషులు తమ ప్రాణాలను వారే తీసుకుంటారు.. ఇలా చేసేది కేవలం మనుషులే జంతువులు, పక్షులు ఆత్మహత్య చేసుకోవడం మీరెక్కడైనా విన్నారా..? అసలు అవి ఎందుకు చేసుకుంటాయి అనుకుంటున్నారా..? కానీ పక్షులు కూడా ఆత్మహత్య చేసుకుంటాయట..కేవలం ఆత్మహత్య చేసుకోవడానికే స్పెషల్‌గా ఒక ప్లేస్‌కు వెళ్తాయి..
పరిశోధనలు, నివేదికల ప్రకారం, మనిషి కాకుండా ఏ జీవి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన దాఖలాలు లేవు. కొన్ని జంతువులు దుఃఖం లేదా ఒత్తిడి అనుభవిస్తున్న సమయంలో ఆహారం తినడానికి నిరాకరిస్తున్న కథలు ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు.. అలాగే కొన్ని కీటకాలు తమను తాము త్యాగం చేయడం ద్వారా తమ కాలనీని రక్షించుకుంటాయని కొన్ని నివేదికలు తెలిపాయి. కానీ ఈశాన్య భారతదేశంలో అస్సాంలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అందమైన హిల్ స్టేషన్లకు ఈ రాష్ట్రం చాలా ప్రసిద్ధి. ఇక్కడి డిమా హసావో జిల్లాలో హఫ్లాంగ్‌కు దక్షిణాన దాదాపు తొమ్మిది కి.మీ దూరంలో జటింగా అనే ఓ కుగ్రామం ఉంది. ఇది పక్షి వీక్షణకు అద్భుతమైన ప్రదేశం, ఎన్నో వేల రకాల పక్షులను చూడటానికి ఇక్కడికి పర్యాటకులు తండోపతండాలుగా వస్తుంటారు. అయితే సుందరమైన గ్రామం అయిన ఈ జటింగా ఒక విచిత్రమైన అంశంలో మాత్రం చాలా ప్రసిద్ధి పొందింది. అదే ‘పక్షి ఆత్మహత్యలు’! ఈ గ్రామంలో ఒక నిర్ణీత సమయంలో పక్షులు ఆత్మహత్య చేసుకుంటాయట.
సీజన్‌ బట్టి పక్షలు ఒక చోట నుంచి మరోచోటుకు వలస వెళ్తుంటాయి. అవి జతకట్టడానికి, గుడ్లు పెట్టడానికి లేదా ఆహారం కోసం వచ్చి, ఆ సీజన్ ముగియగనే తిరిగి వెళ్లిపోవడం గురించి మీకు తెలిసిందే. అయితే జటింగాకు మాత్రం పక్షులు ఆత్మహత్య చేసుకోవడానికే వలస వస్తున్నాయని టాక్… ఆగస్ట్ నుంచి నవంబర్ నెలల మధ్య ఇక్కడికి వలసే వచ్చే పక్షులు ఆకాశం నుండి దూకేస్తున్నట్లుగా నేలమీద పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. చాలా మంది పక్షి శాస్త్రజ్ఞులు, పర్యాటకులు ఈ వింతను చూడటానికే ఏటా ఇక్కడకు వస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మీరే ఆలోచించండి. ఇక్కడి గిరిజన ప్రజలు ఒక కొండ ప్రాంతంలో ఏదో దుష్టశక్తి ఉందని అందుకే పక్షులు ఆత్మహత్య చేసుకుంటున్నాయని నమ్ముతారు. జటింగాను పక్షుల మృత్యులోయ అని అంటారు.. అంతుచిక్కని రహస్యం వెనక కారణం ఏమయ్యుంటుందని శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు ఎన్నో ఏళ్లగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు..

కారణం అదేనా..?

ఈ ప్రాంతంలో పొగమంచు ఎక్కువగా ఉంటుంది, పర్యాటకుల సౌకర్యార్థం ఇక్కడ కొండలపై అధిక ప్రకాశం గల సెర్చ్‌లైట్‌లను అమర్చారు. ఇక్కడి ఇళ్లను గిరిజనులు పొడవైన వెదురుబొంగులతో నిర్మిస్తారు… అధిక ప్రకాశం గల లైట్లకు పక్షులు ఆకర్షితం అవుతున్నాయి..పొగమంచులో అయోమయం చెంది పక్షులు వెదురుబొంగులకు వచ్చి గాయపడుతున్నాయి..అందుకే పక్షి మరణాలు సంభవిస్తున్నాయి అని పర్యావరణవేత్తలు అవగాహన కల్పిస్తున్నారు. అయినప్పటికీ కొన్ని సందేహాలకు జవాబులు లేకపోవడం వలన ఆ నమ్మకం ఇప్పటికీ అలాగే కొనసాగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version