డెన్మార్క్‌లోని అర్హస్ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల ఎమ్మా ఆల్డెన్‌రైడ్ అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఆమెకు టచ్ అలర్జీ ఉంది. అంటే.. ఆమె చర్మంపై ఎవరైనా లేదా ఏ వస్తువుతో అయినా టచ్ చేస్తే.. ఆ ప్రాంతంలో వాపులు వస్తాయి. తరువాత కొంత సేపటికి వాపులు మాయమవుతాయి. దీన్నే వైద్య పరిభాషలో డెర్మటోగ్రాఫియా అని పిలుస్తున్నారు.
ఎమ్మాకు 3 ఏళ్ల కిందట ఈ వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. అప్పట్లో ఓ స్నేహితురాలు ఆమెను టచ్ చేయగా.. ఆమె చర్మంపై వాపులు వచ్చాయి. దీంతో ఆమెకు ఈ వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. అయితే వైద్యులు ఈమెకు యాంటీ హిస్టమైన్స్ అనబడే మెడిసిన్లను ఇస్తామని చెప్పారు. కానీ ఈ వ్యాధి వల్ల తనకు ఇబ్బంది లేదని, చర్మం వాపులకు గురైనా కొంత సేపటికి మాములుగా అవుతుందని, ఇక టచ్ చేసినప్పుడు చర్మం వాపు వచ్చినా తనకు నొప్పి ఏమీ కలగడం లేదని, కనుక మందులను వేసుకోనని చెప్పింది.
ఇక అప్పటి నుంచి ఎమ్మా.. రక రకాల వస్తువులతో తన చర్మంపై రాస్తూ డూడుల్స్‌ను సృష్టిస్తోంది. దీంతో ఆ డూడుల్స్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆమె పెన్సిల్స్ తో రక రకాల డూడుల్స్ ను తన చర్మం మీద రాస్తోంది. దీంతో పెన్సిల్ టచ్ అయిన చోట వాపు వస్తుంది. తరువాత ఆ డూడుల్ ఆకారం ప్రత్యక్షమవుతుంది. అనంతరం 30 నిమిషాలకు ఆ వాపు తగ్గి డూడుల్ మాయమవుతుంది. కాగా ఎమ్మాకు చెందిన మరో ఇద్దరు కజిన్స్‌కు కూడా సరిగ్గా ఇలాంటి వ్యాధే ఉంది. అయితే దీని వల్ల అంత హాని లేనప్పటికీ ముందు ముందు ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తే రావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాగా ఆమె చర్మంపై ఇలా అనేక ఆకారాలను, రాతలను రాస్తుండడంతో ఆమెను హ్యూమన్ ఎచ్-ఎ-స్కెచ్ (హ్యూమన్ స్కెచ్) అని పిలుస్తున్నారు.