వాహ్‌.. భలే ఐడియా.. కూరగాయల వ్యర్థాలతో బయోగ్యాస్‌ ప్లాంట్‌.. ఎల్‌పీజీపై సగం డబ్బు ఆదా..!

-

మన దేశంలో సాధారణంగా ఒక కుటుంబం నెలకు 1 ఎల్‌పీజీ సిలిండర్‌ను వాడుతుంది. అదే ఏడాదికి 12 సిలిండర్లు అవసరం అవుతాయి. వాటిలో 6 సిలిండర్లను ప్రభుత్వం రూ.400 సబ్సిడీ ధరకు ఇస్తుంది. ఇక మిగిలిన 6 సిలిండర్లను రూ.700 నుంచి రూ.800 ఖర్చు పెట్టి కొనాలి. దీంతో ఆ 6 సిలిండర్లకు 6 నెలలకు మనం రూ.4,800 వరకు ఖర్చు చేస్తాం. అయితే ఆ మొత్తాన్ని కూడా ఆదా చేసుకుంటే.. ఎంతో ఖర్చు తగ్గుతుంది కదా.. అవును.. అందుకనే వారు మినీ బయో గ్యాస్‌ ప్లాంట్‌ను తయారు చేశారు. దాంతో నిత్యం కూరగాయల వ్యర్థాల ద్వారా గ్యాస్‌ను ఉత్పత్తి చేసి దాన్ని వంటలకు ఉపయోగించుకోవచ్చు. దీంతో వంట గ్యాస్‌పై ఎంతో డబ్బు ఆదా అవుతుంది.

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన అంకిత్‌ రాయ్‌, ప్రవీణ్‌ మోడిలు 2017లో శక్తి స్టెల్లార్‌ అనే ఓ స్టార్టప్‌ను ఏర్పాటు చేశారు. దాని సహాయంతో వారు డైజెస్టర్‌ అనబడే పోర్టబుల్‌ బయో గ్యాస్‌ ప్లాంట్‌ను తయారు చేశారు. అందులో ఒక పెద్ద ట్యాంక్‌ ఉంటుంది. ఆ ట్యాంక్‌లో మొదట కూరగాయలు, పండ్లు, ఆహార వ్యర్థాలు వేయాలి. కేవలం మొదటి సారి మాత్రమే ఆవు పేడను అందులో వేయాలి. దీంతో ఆ ట్యాంక్‌లో ఉండే మోటార్‌ ఆ వ్యర్థాలు, ఆవుపేడను సరిగ్గా మిక్స్‌ చేస్తుంది. ఆ తరువాత 10 నుంచి 15 రోజులకు మిథేన్‌ గ్యాస్‌ ఉత్పత్తి అయి ట్యాంక్‌ పై భాగం నుంచి బయటకు వస్తుంది. దాన్ని పైపుల ద్వారా ఇంట్లోని గ్యాస్‌ స్టవ్‌కు తరలించి వంటలు చేసుకోవచ్చు. ఇలా నిత్యం ఆ వ్యర్థాలను వేస్తుంటే గ్యాస్‌ ఉత్పత్తి అవుతుంటుంది. దీంతో నిత్యం ఆ గ్యాస్‌నే వంటలకు వాడి ఎంతో డబ్బును ఎల్‌పీజీపై ఆదా చేయవచ్చు.

ఇక శక్తిస్టెల్లార్‌ వారు రూపొందించిన సదరు పోర్టబుల్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌ను ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. బాల్కనీ, టెర్రెస్‌ ఇలా ఏ ప్రదేశంలో అయినా దాన్ని అమర్చుకోవచ్చు. అందుకు 1.2 చదరపు మీటర్ల స్థలం ఉంటే సరిపోతుంది. అలాగే ట్యాంక్‌ నుంచి వచ్చే గ్యాస్‌ను ఆన్, ఆఫ్‌ చేసేందుకు ప్రత్యేకమైన స్విచ్‌లు ఇస్తారు. ట్యాంక్‌లో ఎంత గ్యాస్‌ మిగిలిఉందో తెలిపే ఇండికేటర్‌ను కూడా ట్యాంక్‌కు అమరుస్తారు. దీంతో ఆ ప్రకారం ట్యాంక్‌లో గ్యాస్‌ స్థాయిలను మనం సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే ట్యాంక్‌లో గ్యాస్‌ ఉత్పత్తి కాగా కింది భాగంలో మిగిలిన వ్యర్థాలను సేకరించి వాటిని మొక్కలకు ఎరువుగా ఉపయోగించుకోవచ్చు. ఈ క్రమంలో ఈ వ్యవస్థ ద్వారా ఎలాంటి వేస్టేజ్‌ ఉత్పత్తి కాదు.

కాగా శక్తి స్టెల్లార్‌ పోర్టబుల్‌ బయో గ్యాస్‌ ప్లాంట్‌ రెండు పరిమాణాల్లో లభిస్తుంది. 3 లీటర్లు, 5 లీటర్లు. ఈ ట్యాంకులకు వరుసగా రూ.40వేలు, రూ.51వేలు ఖర్చవుతాయి. ఇక చిన్న ట్యాంకు నుంచి వచ్చే గ్యాస్‌తో 2.5 గంటల పాటు వంట చేసుకోవచ్చు. అదే పెద్ద ట్యాంక్‌ నుంచి ఉత్పత్తి అయ్యే గ్యాస్‌తో 5 గంటల వరకు వంట చేసుకోవచ్చు. తరచూ ఈ ప్లాంట్‌ నుంచి వచ్చే గ్యాస్‌ను ఉపయోగిస్తే.. పెద్ద మొత్తంలో ఎల్‌పీజీపై డబ్బును ఆదా చేసుకునేందుకు వీలు కలుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version