వారెవ్వా.. ఇంట‌ర్నెట్ లేకుంటే ఏమి ? ఇలా కూడా పాఠాలు చెప్ప‌వ‌చ్చు..!

-

కరోనా వల్ల విద్యార్థులకు పాఠశాలలు ఆన్‌లైన్‌లో తరగతులను నిర్వహిస్తున్నాయి. బాగానే ఉంది. కానీ ఇంటి వద్ద అసలు ఫోన్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్‌ వంటి సదుపాయాలు లేని విద్యార్థుల పరిస్థితి ఏమిటి ? మన దేశంలో చాలా మంది నిరుపేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. వారి ఇండ్లలో కాదు కదా.. వారి గ్రామాల్లో ఇంటర్నెట్‌ సదుపాయమే ఉండదు. అలాంటప్పుడు వారు ఆన్‌లైన్‌లో పాఠాలను ఎలా వింటారు ? మరి ఈ సమస్యకు పరిష్కారం ఏది ? అంటే.. ఆ గ్రామ ఉపాధ్యాయులు ఇందుకు చక్కని ఉపాయం కనిపెట్టారు.

జార్ఖండ్‌లోని బంకతి అనే గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో మొత్తం 246 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వారిలో కేవలం 42 మంది విద్యార్థులకు మాత్రమే ఇంటి వద్ద స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. అయినప్పటికీ ఆ గ్రామంలో ఇంటర్నెట్‌ సదుపాయం సరిగ్గా లేదు. దీంతో విద్యార్థులు ఆన్‌లైన్‌లో తరగతులకు హాజరు కావడం కష్టంగా మారింది. అయితే ఇందుకు అక్కడి ఉపాధ్యాయులు పరిష్కారం కనుగొన్నారు. ఆ గ్రామంలో అనేక చోట్ల లౌడ్‌ స్పీకర్లను ఏర్పాటు చేయించారు. ఈ క్రమంలో ఆ స్కూల్‌కు చెందిన ఉపాధ్యాయులు 5 మంది ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విడతల వారీగా క్లాసులు తీసుకుంటున్నారు. స్కూల్‌లో ఏర్పాటు చేసిన మైక్రోఫోన్‌లో వారు పాఠాలను చెబుతుంటే గ్రామంలో ఆయా చోట్ల ఏర్పాటు చేసిన లౌడ్‌ స్పీకర్లలో వారి పాఠాలు వినిపిస్తాయి. ఆ స్పీకర్ల వద్ద విద్యార్థులు కూర్చుని ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను వింటారు. నోట్స్‌ రాసుకుంటారు. ఇలా ఆ ఉపాధ్యాయులు అక్కడి విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు.

కాగా ఈ విషయంపై అక్కడి ఉన్నతాధికారులు స్పందించారు. ఆ ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు అనుసరిస్తున్న పద్ధతిని వారు మెచ్చుకున్నారు. విద్యార్థులకు ఎలాగైనా సరే విద్యనందించాలని వారు చేసిన ప్రయత్నాన్ని ఆ గ్రామస్థులు కూడా అభినందిస్తున్నారు. అవును మరి.. ఆన్‌లైన్‌లో పాఠాలు చెబుతున్నామంటూ రూ.వేలు, లక్షల్లో ఫీజులు దండుకునే స్కూళ్ల కన్నా.. ఇలాంటి స్కూళ్లు ఎంతో బెటర్‌ కదా.

Read more RELATED
Recommended to you

Exit mobile version