దేశవ్యాప్తంగా కరోనా రోజు రోజుకీ విస్తరిస్తోంది. ఆదివారం వరకు 107 కరోనా కేసులు నమోదు కాగా సోమవారం ఉదయం వరకు ఆ సంఖ్య 110కి చేరుకుంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ ఇప్పటికే కరోనాపై పోరాటం చేద్దామని సార్క్ దేశాల వీడియో కాన్ఫరెన్స్‌లో పిలుపునిచ్చారు. అయితే కరోనాపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు, సమాచారం తెలుసుకునేందుకు గాను ఓ టెక్ కంపెనీ నూతన వెబ్‌సైట్‌ను రూపొందించి దేశంలోని ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. అదేమిటంటే…
కిప్రోష్ అనే టెక్ కంపెనీ http://covidout.in పేరిట ఓ నూతన వెబ్‌సైట్‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. అందులో దేశవ్యాప్తంగా ఉన్న కరోనా బాధితుల సంఖ్యను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అలాగే హాస్పిటళ్లలో ఎంత మంది చికిత్స తీసుకుంటున్నారు, ఐసీయూలో ఎంత మంది ఉన్నారు, ఎంత మంది కరోనా నుంచి రికవర్ అయ్యారు, ఇప్పటి వరకు ఆ వైరస్ కారణంగా ఎంత మంది చనిపోయారు.. అనే వివరాలను చార్టులు, గ్రాఫ్‌ల రూపంలో తెలుసుకోవచ్చు.
ఇక ఏయే రాష్ట్రాల్లో ఎంత మంది కరోనా బాధితులు ఉన్నారు, వైరస్ ఎలా వ్యాప్తి చెందుతోంది.. అన్న వివరాలను కూడా ఈ సైట్‌లో తెలుసుకోవచ్చు. అలాగే ముందు చెప్పిన వివరాలను ఈ సైట్‌లో తేదీల వారీగా కూడా తెలుసుకోవచ్చు. కరోనాపై ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం అందించేందుకు ఈ సైట్‌ను అందుబాటులోకి తెచ్చామని నిర్వాహకులు తెలిపారు.