మీ ఆలోచనలే మీ జీవిత విధానాన్ని నిర్దేశిస్తాయి. మీరేం అలోచిస్తున్నారో అలాగే తయారవుతారు. అవును. మనం ఆలోచించే విషయాల మాదిరిగానే మన చర్యలు ఉంటాయి కాబట్టి, ఆలోచనలే చర్యలకి కారణాలవుతాయి కాబట్టి, అవే నిజజీవితంలో ప్రతిబింబిస్తాయి. ఐతే చాలా మంది ఆలోచనలు ఆకాశంలో ఉంటాయి. కానీ చర్యలు అంగుళం కూడా జరగవు. ఆకాశాన్ని అందుకోవలనే ఆలోచన ఉంటుంది కానీ దానికి చేయాల్సిన చర్యలని మాత్రం పట్టించుకోరు.
అలాంటి వారు ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు. వాటిని రియాలిటీలోకి తీసుకురావాలనే ఆలోచన వచ్చినా బద్దకం వల్ల అక్కడే ఉండిపోతారు. ఆలోచనలు గొప్పగా ఉంటాయి. దానికి కావాలిన కృషి చేయరు. నిజానికి వీళ్ళు అనుకుంటే చేయగలరు. కానీ ఎంత గట్టిగా అనుకున్నా ఏదో ఒకటి వీళ్ళని ఆపుతుంది. ఇలాంటి వారి ఆలోచనలు రియాలిటీలోకి రావాలంటే కొంచెం కష్టపడాల్సి వస్తుంది. కానీ అసాధ్యం కాదు. ఏదైనా సరే, ఎవరెస్టు ఎక్కడం అయినా సరే, ఆ ఆలోచన ముందుగా రావాలి. అప్పుడే అది సాధ్యం అవుతుంది.
ఎవరెస్ట్ ఎక్కాలన్న ఆలోచనే నీకు పదే పదే వస్తున్నప్పుడు దానికి కావల్సిన చర్యలని చేపడతావు. నీకు తెలియకుండానే దానికి కావాల్సిన సమాచారం అంతా సేకరిస్తావు. ఏదో ఒక రోజు ఎవరెస్ట్ ఎక్కుతావు. అసలు అలాంటి ఆలోచనే నీకు లేకపోతే ఎక్క్కడ ఉన్నావో అక్కడే ఉండిపోతావు. కొంత మంది అంతే. ఆలోచించడానికి కూడా భయపడతారు. గమ్యాన్ని తలచుకోవడానికి కూడా వారికి ఇష్టం ఉండదు. మనం అంతదాకా వెళ్ళలేంం మనమింతే అని ఫిక్స్ అయిపోతారు.
నీ పరిధిని నువ్వే చిన్నగా చేసుకుంటే ఎలా. గొప్ప గొప్ప ఆలోచనలు గొప్ప వారికే వస్తాయి. అస్సలు ఆలోచించకపోవడం కన్నా ఆలోచనలు రావడం గొప్ప. ఆలోచనలే జీవిత గమనాన్ని నిర్దేశిస్తాయి. మిమ్మల్ని గెలుపు తీరాలకి చేరుస్తాయి.