నాలుగు వారాలుగా రాజధాని అమరావతి కోసం రైతులు ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో మాజీ సీఎం చంద్రబాబు సైతం అన్నదాతల ఆందోళనలకు మద్దతిస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నేడు తిరుపతిలో పర్యటించనున్నారు. అమరావతి సంరక్షణ ర్యాలీలో చంద్రబాబు పాల్గొననున్నారు. హైదరాబాద్ నుంచి ఆయన 12.45 గంటలకు ఫ్లైట్‌లో బయలుదేరి మధ్నాహ్నం 2.10 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్టు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా మధ్యాహ్నం 3.15 గంటలకు తిరుపతిలోని ఫులే విగ్రహం వద్దకు చేరుకుంటారు.
ఆ విగ్రహం నుంచి నాలుగుకాళ్ల మండపం వరకు అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగే ర్యాలీలో పాల్గొని, సాయంత్రం 5 గంటలకు అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. అయితే చంద్రబాబు ర్యాలీకి అనుమతి లేదంటున్నారు పోలీసులు. సంక్రాంతి పండుగ సీజన్ కావడంతో ర్యాలీకి అనుమతి ఇవ్వలేమని తిరుపతి అర్బన్ ఎస్పీ చెబుతున్నారు. మరోవైపు పోలీసులు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో తిరుపతిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా పలువురు టీడీపీ నేతల్ని సైతం హౌస్ అరెస్ట్ చేశారు.