తిరుపతిలో భక్తుల తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారణ జరుపుతోంది. హోంమంత్రి అనితతో పాటు ఇతర మంత్రులు సైతం ఆస్పత్రికి వెళ్లి బాధితులను, వారి కుటుంబసభ్యులను పరామర్శించారు.
ఈ క్రమంలో మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే రోజా తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీరియస్ అయ్యారు. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌పై పెట్టినట్లుగా తిరుపతి తొక్కిసలాట ఘటనపై కేసులు ఎందుకు పెట్టడం లేదని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు, టీటీడీ, ఎస్సీ, కింది స్థాయి అధికారులే దీనికి బాధ్యత వహించాలని రోజా స్పష్టంచేశారు. అల్లుఅర్జున్ మీద బీఎన్ఎస్ 105 సెక్షన్ పెట్టారని, కానీ తిరుపతి తొక్కిసలాట ఘటనలో 105 సెక్షన్‌కు బదులుగా 194 బీఎన్‌ఎస్ సెక్షన్ పెట్టారని గుర్తుచేశారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందని, ఎవరూ కావాలని చేయలేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని రోజా ఫైర్ అయ్యారు.