ఏడాదిలోగా టోల్‌ ప్లాజాలను ఎత్తేస్తాం.. కేంద్రమంత్రి ప్రకటన

-

దేశంలో ఉన్న అన్ని టోల్‌ ప్లాజాలను ఏడాదిలోగా ఎత్తేస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. గురువారం లోక్‌ సభలో ఆయన ఈ ప్రకటన చేశారు. జీపీఎస్‌ ఆధారిత టోల్‌ సేకరణ చేపడతామని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు దేశంలో 93 శాతం వాహనాలు ఫాస్టాగ్‌ వాడుతున్నాయని, మిగిలిన 7 శాతం వాహనాలకు రెట్టింపు టోల్‌ వేసినా కూడా ఇంకా ఫాస్టాగ్‌ తీసుకోలేదని చెప్పారు. వాహనాలపై ఉండే జీఎపీఎల్‌ ఇమేజింగ్‌ ద్వారా టోల్‌ సేకరిస్తామని గడ్కరీ వెల్లడించారు. వాహనాలకు ఫాస్టాగ్‌ లేక పోతే టోల్‌ దొంగతనం, జీఎస్టీ ఎగవేత లాంటి ఘటనలు చోటుచేసుకుంటాయని వివరించారు.

 

అంతేకాదు కేంద్ర రోడ్డు రవాణా సంస్థ మరో విషయాన్ని ప్రకటించింది. ఒకవేళ మీ వద్ద 15 ఏళ్లకు పైబడిన పాత వాహనం ఉందా?.. అయితే, మీకో బ్యాడ్‌ న్యూస్‌. ఎందుకంటే, 15 ఏళ్ల పైబడిన పాత వాహనాల ఆర్‌సీ రెన్యువల్‌, ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌ ఛార్జీలను భారీగా పెంచుతూ కేంద్ర రోడ్డు రావాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇకపై, 15 ఏళ్లు పైబడిన వాహనాల ఆర్‌సీ రెన్యువల్‌కు రూ.5,000 చెల్లించాల్సి ఉంటుంది. అంటే, ప్రస్తుతం అమల్లో ఉన్న ఫీజుకు 8 రెట్లు ఎక్కువ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాక, ఆర్‌సీ రెన్యువల్‌ ఆలస్యం చేసే వారిపై కూడా భారీ జరిమానాలతో కొరడా ఝుళిపించనుంది. ఇకపై, ప్రైవేట్‌ వాహనాల రిజిస్ట్రేషన్‌ రెన్యువల్‌లో ఆలస్యం చేస్తే, నెలకు రూ .300 – 500 రూపాయల జరిమానా వసూలు చేయనుంది.

ఒకవేళ, వాణిజ్య వాహనాలకు ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌ రెన్యువల్‌ ఆలస్యం చేస్తే రోజువారీగా రూ .50 జరిమానా విధించనుంది. అదేవిధంగా, 15 ఏళ్ల కంటే పాత ద్విచక్ర వాహనాల ఆర్‌సీ రెన్యువల్‌ ఫీజును రూ.300 నుంచి రూ .1000కి పెంచనుంది. పాత బస్సు లేదా ట్రక్కు ఫిట్‌నెస్‌ రెన్యువల్‌ కోసం రూ .12,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది, ప్రస్తుతం అమల్లో ఉన్న ఫీజు కంటే దాదాపు 21 రెట్లు ఎక్కువ అని చెప్పవచ్చు. కాగా, 2021 అక్టోబర్‌ 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. వాహన స్క్రాపేజ్‌ విధానాన్ని రూపొందించే ప్రణాళికలో భాగంగా రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఈ పెంపును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version