ఏపీలో వైసీపీ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో సంతృప్తి బాగా కనిపిస్తోంది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, జగన్ పరిపాలన చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. నిరంతరం సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ, ప్రజల బాగోగులు చూడడమే తన ఏకైక లక్ష్యంగా పని చేస్తూ ,ముందుకు వెళ్లడం… ఇలా ఎన్నో అంశాలతో వైసీపీ ప్రభుత్వం పై జనాలకు నమ్మకం ఏర్పడింది. తాము వేసిన ఓట్లు వృధా కాలేదు అనే సంతృప్తి వారిలో కనిపిస్తోంది.
ఇక వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రతినిధులు సైతం ఇదే రకమైన వైఖరితో ఉంటున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా, మొత్తం జగన్ క్రెడిట్ మీదే నాయకులంతా భారం వేసి , జగన్ చరిష్మా మీదే నెట్టుకురావాలి అని చూస్తూ ఉండడం, ఏదైనా జగన్ చూసుకుంటారని, తాము ప్రజాక్షేత్రంలో తిరిగినా , తిరగకపోయినా జగన్ హవాతో తమకు ఎటువంటి ఇబ్బంది ఉండదనే అభిప్రాయంలో నాయకులు నిర్లక్ష్యంగా ఉంటున్నారనే విషయంపై జగన్ సైతం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.
ఏపీ ప్రభుత్వానికి సంబంధించి పరిపాలనా పరంగా చూసుకుంటే .. బ్రహ్మాండంగా ఉంది అనే రిపోర్ట్స్ వస్తున్నా, ఎమ్మెల్యేల పనితీరు పైనే పార్టీలో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేలు సొంతంగా బలం పెంచుకునే విషయంపై దృష్టి సారించకుండా, ప్రతి దశలో జగన్ క్రేజ్ ను వాడుకుని తమ రాజకీయ బండిని లాగించేయలి అని చూస్తూ ఉండడం ఇబ్బందికరంగా మారింది. ఈ తరహా వ్యవహారాలు కొంతకాలం వరకు వర్కవుట్ అయినా, ముందు ముందు ఎమ్మెల్యేలకు కానీ, ప్రభుత్వానికి గానీ తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.
ప్రభుత్వ పథకాలు, జగన్ చరిష్మా మీద ఆధారపడకుండా, ఎమ్మెల్యేలు సొంతంగా ప్రజాక్షేత్రంలో తిరుగుతూ, ప్రజా సమస్యలపై దృష్టిపెట్టి, ప్రతిపక్షాల విమర్శలకు తావు ఇవ్వకుండా ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరిస్తూ, ఎమ్మెల్యేలు సొంత ఇమేజ్ ను పెంచుకొకపోతే రానున్న రోజుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎప్పటికప్పుడు జగన్ కు అందుతున్న ఇంటిలిజెన్స్ రిపోర్ట్ లలో సైతం ఎమ్మెల్యేల పనితీరుపై ఇదే రకమైన ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయట. అయితే ఇదే విషయమై ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తే వారి నుంచి మరో రకంగా సమాధానం వస్తోంది. ప్రజాక్షేత్రంలో పనిచేసేందుకు ఏమీ లేదని, సర్వం అధికారుల ద్వారానే అన్నీ జరిగిపోతున్నాయి అని, తాము చేసేందుకు ఏమీ లేదు అంటూ వారి ఇబ్బందులను ఏకరువు పెడుతున్నారట. ఈ వ్యవహారాల్లో అధినేత తప్పు చేస్తున్నా, ఎమ్మెల్యే లు తప్పు చేస్తున్నా చివరకి జరగాల్సిన నష్టం అయితే జరిగిపోతోందట.
-Surya