వర్షాకాలం వచ్చిందంటే చాలు అనేక మంది ప్రకృతి అందాలను చూసేందుకు వివిధ పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. ఓవైపు చిరుజల్లులు కురుస్తుంటే.. మరోవైపు పచ్చని ప్రకృతి రమణీయతలో పారవశ్యం పొందాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఇక జలపాతాల వద్ద పర్యాటకుల సందడి అంతా ఇంతా కాదు. అయితే వానాకాలంలో జలపాతాలు, పచ్చని ప్రకృతి రమణీయత, ఆహ్లాదకరమైన వాతావరణం ఇలా అన్ని ఉండే ప్రాంతాల కోసం చూస్తున్నారా. అయితే ఈ స్టోరీ చదివేయండి. అలాంటి ప్రాంతాలు ఎక్కడున్నాయో తెలుసుకోండి..
పర్వత శిఖరాలపైన కనిపించే ఈ పీఠ భూములు హెలిప్యాడ్‌లను పోలి ఉంటాయి. రుతుపవనాలు ప్రవేశించి వర్షాలు మొదలయ్యేసరికి వివిధ రకాల గడ్డి పెరిగి, కొండలన్నీ పచ్చటి తివాచీ పరిచినట్లు కనిపిస్తాయి. దీంతో ఆ ప్రదేశానికి రంగులు వేసినట్లుగా పచ్చిక బయళ్లు.. వాటిపై రంగురంగుల బొట్లు పెట్టినట్లుగా వివిధ రకాల పూలు చూడముచ్చటగా కనిపిస్తాయి. పసుపు రంగు, ఇతర రంగుల పుష్పాలతో రంగురంగు తివాచీలు పరచి మనకు స్వాగతం పలుకుతున్నట్లు అనిపిస్తుంది.
ఈ ప్రకృతి దృశ్యాలను తిలకించేందుకు, పలు రకాల పుష్పాలను, పక్షులను అధ్యయనం చేసేందుకు వృక్ష, జంతు శాస్త్ర నిపుణులు, ప్రకృతి ప్రేమికులు, ఫొటోగ్రఫీ ప్రియులు, పర్యాటకులు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాదిగా ఈ ప్రదేశానికి తరలివస్తుంటారు. పర్వత ప్రాంతం ఈ రెండు నెలల్లో పర్యాటకుల వాహనాలతో కిక్కిరిసిపోతుంది. అయితే ఈ పీఠభూమికి కాలినడకన మాత్రమే చేరాల్సి ఉంటుంది. ఈ ప్రకృతిని ఆస్వా దించిన పర్యాటకులకు ఈ ప్రదేశం తమ జీవితంలో ఒక మధురానుభూతిగా నిలిచిపోతుంది.
సతారా నుంచి కాస్‌కు వెళ్లే మార్గం కొంత ఇరుకుగా ఉన్నప్పటికి పర్వతాలపైకి వెళ్తున్నంతసేపు పర్యాటకులను తాకే చల్లటి గాలులు మొత్తం శ్రమను దూరం చేస్తాయి. ముందుకు సాగుతున్నంతసేపూ ఎన్నో అద్భుతాలను, మనోహరమైన ప్రకృతి దృశ్యాలను కెమరాలలో బంధించవచ్చు. ముఖ్యంగా ప్లాస్టిక్‌కు సంబంధించిన ఎలాంటి వ్యర్థ పదార్థాలు ఇక్కడ మచ్చుకైనా కనిపించవు. దీంతో వాతావరణం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన సందర్శకులు పూలను, మొక్కలను తెంచకపోవడం మరో విశేషం. సంవత్సరంలో ఒక్కసారి వచ్చే ఈ వింత లోకాన్ని చూడడానికి పర్యాటకులు ఉవ్విళ్లూరుతుంటారు.
వందలాది గాలి మరలు ఇక్కడ పర్వతాలపై మనకు టాటా చెబుతూ వీడ్కోలు పలుకుతుంటాయి. ఈ దృశ్యాలను చిత్రీకరించేందుకు పలు సినిమా షూటింగ్‌లు ఇక్కడ జరుగుతుంటాయి. ఈ గాలి మరల ద్వారా ఇక్కడ విద్యుచ్ఛక్తిని తయారు చేస్తున్నారు. అందుకే సతారా జిల్లాను ‘డిస్ట్రిక్ట్ ఆఫ్ పవర్’గా పిలుస్తున్నారు. చల్కేవాడి పవన నిలయంగా చెప్పవచ్చు.
సతారాకు చెందిన శిందే ఈ ఆర్గానిక్ ఫామ్‌ను నడుపుతున్నారు. ఔషధ గుణాలు కలిగిన సర్పగంధ, ఇన్సులిన్, తులసి లాంటి వివిధ మొక్కలను ఇక్కడ పెంచుతున్నారు. ఇక్కడ సజ్జన్‌ఘడ్ కోటను కూడా చూడవచ్చు.
తోసేఘర్ వాటర్ ఫాల్స్… సతారా నుంచి 20 కి.మీ. దూరాన తోసేఘర్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఈ వాటర్ ఫాల్స్ వెయ్యి అడుగుల పైనుంచి కిందున్న లోయలోకి పడుతుంటాయి. పర్యాటకులకు ఈ దృశ్యం అద్భుతంగా కనిపిస్తుంది. వేలాది మంది పర్యాటకులు ఈ జలపాతాలను చూడడానికి దేశ నలుమూలల నుంచి వస్తుంటారు. వాటర్ ఫాల్స్‌కు ఎదురుగా ఉన్న లోయపైన ఒక ప్లాట్‌ఫాంను నిర్మించడం వల్ల ఈ జలపాతాలను దగ్గరగా చూసేందుకు అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఎటువంటి సాహస కృత్యాలు చేయకూడదు. గతంలో చాలామంది పర్యాటకులు నిర్లక్ష్యంగా వ్యవహరించి తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఇక్కడి ప్రకృతి అందాలు పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి.