తెలంగాణ ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ తొలిసారిగా రాష్ట్రానికి విచ్చేయగా..కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఆమెకు టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కండువా కప్పి స్వాగతం పలికారు. ఆయన వెంట ప్రోటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్, ఫహీం, రచమల్ల సిద్దేశ్వర్ ఇతర నేతలు ఉన్నారు.
శుక్రవారం గాంధీ భవన్‌లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది.దీనికి పీసీసీ చీఫ్ అధ్యక్షత వహించనుండగా..చీఫ్ గెస్టుగా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌తో పాటు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొననున్నారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, పీఏసీ, పీఈసీ సభ్యులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాల చైర్మన్లు, కార్పొరేషన్ ఛైర్మన్‌లు తదితర కాంగ్రెస్ శ్రేణులు సైతం హాజరుకానున్నారు.