ఆగస్టు 9 నుంచి పట్టణాల్లో ఇంటింటికీ జెండాల పంపిణీ

-

స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 9నుంచి 14వరకు పురపాలికల్లో ఇంటింటికీ జెండాల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు పురపాలకశాఖ డైరెక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ శుక్రవారం తెలిపారు. 8 నుంచి 22వ తేదీ వరకు పురపాలికల్లో ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళిక రూపొందించినట్టు చెప్పారు. ఇందులో భాగంగా 75, 750, 7500, 75 వేలు చొప్పున మొక్కలను నాటేందుకు ప్రాధాన్యమివ్వాలని అధికారులకు పిలుపునిచ్చారు. 21వ తేదీన ప్రత్యేకంగా పురపాలక కౌన్సిల్‌ సమావేశాలను నిర్వహించడం ద్వారా స్వాతంత్య్ర పోరాటం గురించి చర్చించి, సమరయోధులకు నివాళులు అర్పిస్తూ తీర్మానాలు చేయాలని ఆదేశించారు.

దేశభక్తి, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి ప్రజలందరిలో రగిలేలా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. విద్యార్థులు, ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, యువతీ యువకులు సహా యావత్‌ తెలంగాణ సమాజం ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

వజ్రోత్సవాల సందర్భంగా ఈ నెల 21న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని, అదేరోజు రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీలు, మండల పరిషత్‌లు, జడ్పీలు, నగర, పురపాలికల్లో ప్రత్యేక సమావేశాలుంటాయని వెల్లడించారు. ఉత్తమ గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ, పాఠశాల, రైతు, వైద్యుడు, ఇంజినీర్‌, పోలీస్‌ అధికారి, కళాకారుడు, గాయకుడు, కవి తదితరులను గుర్తించి సత్కరిస్తామని వివరించారు. రాష్ట్రంలో మొత్తం 1.20 కోట్ల గృహాలపై ఎగురవేసేందుకు జాతీయ జెండాలను ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version