మీ అమ్మనాన్నలు సంతోషిస్తారు నీ ప్రతిభకు అని ఎవ్వరన్నా ..ఆనందించాలి..అంతెత్తు నట విశ్వరూపం ఒక్కడిగా నిలిచిపోయిన సందర్భం ఉంటే గర్వపడాలి..భారతీయులంతా ఒక్కటే మూస అని అనుకుంటే నవ్విపోవాలి.. నటులకు నటన తప్ప వేరే ప్రపంచం వ్యాపకం ఉండకూడదు అని అంటే హాయిగా గుర్తించి గర్వించాలి..వీటికి తూగే అతడు..మనందరి నుంచి ప్రేమనో అభిమానాన్నో తీసుకుని..గుప్పెడు భారాన్నీ మిగిల్చి దూరాన్నీ పెంచి,ఈ నివాళి వేళలో..ఏమయిపోయాడు..ఏమో!
మిస్టర్ అనగా అటెన్షన్
ఇర్ఫాన్ అనగా అనౌన్స్ మెంట్
అథెంటిక్ అనౌన్స్‌మెంట్ ఇది
ఆయన చావు గురించి కాదు ఆయన బతికిన
బతకాల్సిన మిగిల్చిపోయిన క్షణాల గురించి జ్ఞాపకాలు గురించి
ఆనందం గురించి మిగిల్చిపోయిన ఉప్పునీటి ఉప్పెనలు గురించి..
ఇవేమయినా భారతీయ సినిమా భారాన్నీ సారాన్నీ దించిపోతాయా మార్చిపోతాయా
తెలియదు కానీ ఒక నటుడి స్మరణ ఈ ఉదయాన ఒక ప్రాతఃస్మరణ ఈ సంజె గాలుల్లో !
ఇంకా ఏవేవో ఎన్నెన్నో.. వాట్ నాట్ వాట్ ఎల్స్ ..ప్రపంచాన్ని చుట్టి వచ్చినంత ఆనందాలు కొన్ని ఉంటాయి..విషాదాలుంటాయి..విరుగుడు కానివి కొన్ని ఉంటాయి..నువ్వు మాత్రం ఏ కోవో తెలియదు..వెళ్లిపోవడం విషాదం అయితే గెలిచిరావడం ఆనందం అవుతుంది..గెలిచి ఈ రంగాన నిలుపుకుని తీరడం పేరు కు మాత్రమే సొంతమవుతుంది..మంచి పేరు అంటే చివర ఖాన్ ఉందని కాదు.. మొదట ఇర్ఫాన్ ఉందనీ కాదు..నటనకు పేరు పాత్రకు పేరు ఇంకేమయినా ఉంటే గింటే ఈ చావులో కూడా పేరు వచ్చింది. ఇలాంటి వేళ నీకో నివాళి.
బాగా గుర్తు సర్ ఒక్క రూపాయి ఒక్కటంటే ఒక్కరూపాయే అనే వాడివి గుర్తుందా.. హచ్ నెటవర్క్ కు వచ్చినప్పుడు అనుకుంటానయ్యా ..ఇంట్లో అనేవారు ఏంటి ఈయన మరీ మెస్మరైజ్ చేసేస్తున్నాడు అని..ఊళ్లో ఆ రెడ్ బ్యాగ్రౌండ్ లో నీ ఫొటో చూసి కొన్ని సార్లు నవ్వేసేవాడ్ని..ఇప్పుడు కన్నీరు రావడం లేదు కానీ వచ్చినట్లు నటించను కానీ ప్రతిభకు కొంత విస్తృతి కావాలంటే నేను నమ్మను..విస్తృతిలో ఉన్న ఏ ప్రతిభా నీ అంత గొప్పది అని కూడా అనుకోను.. ఐ స్డాండ్స్ ఫర్ అని ఎవ్వడయినా డిఫైన్ చేయగలడా.. చావుకు దగ్గరగా పోతూ కూడా ఐ స్టాండ్స్ ఫర్ అని ఎవ్వడయినా డ్రెమటిక్ నోట్ లేకుండా పలకగలడా! ఏమోనయ్యా! నీవు ఎక్కడ ఉన్నా హాయిగా ఉండు..అంతా స్వర్గ విసర్గ నరక నగరాల నిర్మాణాలు గురించి మాట్లాడతారు..తెలివయిన నాలాంటి వారు వాటిని నమ్మరు.. నమ్మేందుకు ఈ రంజాన్ వేళలు సహకరించవు కూడా!
ఆ భగవంతుడు అనే వాడికి కొన్నింట దయ ఉందని నమ్మకం ఉందని కూడా అనుకోను.. ఏమయినా వెళ్లాల్సినప్పుడు వెళ్లిపోవాలి ఈ లోకం నీ స్థానం ఖాళీ చేసి పోవాలి అని చెబుతారే అవి కూడా నమ్మను.. నిలుపుకోదగ్గ ప్రేమ నిలుపుకోదగ్గ దయ మనలో ఉన్నప్పుడు లోకాలను ఖాళీ చేయడం కుదరని పని. ప్రేమ ఆస్తి అయినప్పుడు పంపకాలు ఎలా పూర్తికాకుండా పోతాయి. కనుక చావుతో పోరాటం చేసినప్పుడో బతుకులో అలసిసొలసి ఉన్పప్పుడో థియేట్రికల్ వర్డ్స్ ఏవో గుర్తుకువచ్చి ఉంటాయి.. నటులకు డ్రామా పండించడం సులువు.. తెర వెనుక ఆ నీడలను అలసి సొలసినప్పుడు ఊరడించడమే కష్టం..
ఇప్పుడు కూడా రంగులన్నీ ఇలా విస్తుబోతాయా.. ప్రపంచ ఖ్యాతి నీ సినిమాతో వచ్చిందా నీ సినిమానే నీకు ఇచ్చిందా.. ఏమో! ఇక్కడి ఆకలి ఇక్కడి కన్నీరు ఒక్కడి దుఃఖం ఎన్నటికీ మారవు.. పోయిరా బాబూ! అరె బాబూ పోయిరా! లవ్యూ సర్..భారతీయులంతా ఉద్విగ్నంగా తోచిన క్షణాలలో ఉన్నారు. తెరపైకి కొన్ని మాత్రమే కనిపించిపోతాయి కొన్ని అధీనం నుంచి అదృశ్యం వరకూ ఉంటాయి..మరి! ఇతడు ఎక్కడి నుంచి ఎందాక.. అలసిసొలసిన చోటు నుంచి అనంతావని దాకా ఉంటాడు మిస్టర్ ఇర్ఫాన్ సలామ్ టు యూ !
– రత్నకిశోర్ శంభుమహంతి
రేఖా చిత్ర ఛాయ : బాబు దుండ్రపెల్లి