దళితులు అందరితో సమానంగా పోటీ పడుతున్నారని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గుర్తిస్తే మంచిదని లేదంటే ప్రజలే బీజేపీకి మొలలు కొడతారని టీఆర్‌ఎస్ దళిత ఎమ్మెల్యేలు సూచించారు. దళితులను ఉద్దేశించి మొలలు కొట్టుకునే వారిగా, చెప్పులు కుట్టుకునే వారిగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని ఇందుకు ఆయకు భారీ మూల్యం తప్పదని వారు హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలను నిరసిస్తూ ప్రభుత్వ విప్‌లు బాల్కసుమాన్, ఎం.ఎస్ ప్రభాకర్, గువ్వల బాలరాజు ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, కిశోర్ కాలే యాదయ్య, చిరుమూర్తి లింగయ్య, ఆరూరి రమేశ్, దుర్గం చిన్నయ్య తదితరులు బహిరంగ లేఖ రాశారు.
లేఖలో ఇలా..
‘‘నడిమంత్రపు సరివస్తే కన్నూమిన్నూ కానకుండా విర్రవీగినట్టు సంజయ్ ప్రవర్తన ఉంది. నోటికొచ్చినట్లు ఇష్టానుసారంగా మాట్లాడుతూ మనుషులను అవమానపరుస్తున్నాడు. తలాతోక లేకుండా మాట్లాడే వ్యక్తిగా ముద్రపడ్డ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి దళితులపై చేసిన వ్యాఖ్యలు దళితుల పట్ల బీజేపీకి ఉన్న వైఖరికి అద్దం పడుతున్నాయి. ఆధునిక యుగంలోనూ దళితుల పరిస్థితులు అలాగే ఉండాలని.. వారు ఇంకా చెప్పులు కుట్టుకుని బతకాలని కోరుకునేలా మాట్లాడం దుర్మార్గం’’ అంటూ లేఖలో పేర్కొన్నారు. మరోసారి దళితుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తే దళితులతో పాటు రాష్ట్ర ప్రజలే బీజేపీకి మొలలు కొట్టడం ఖాయమన్నారు.