సస్పెన్షన్ పేరుతో టీ కాంగ్రెస్ అభాసుపాలైందా

-

తెలంగాణ కాంగ్రెస్ లో కొన్ని నిర్ణయాలు అనూహ్యంగా ఉంటాయి. పార్టీ ఆఫీసుల పై పడి ధ్వంసం చేసి నాయకులు బహిరంగంగా బూతులు తీటుకున్న లైట్ తీసుకుని చర్యలు తీసుకునేందుకు జంకే పార్టీ అగ్ర నాయకత్వం కొన్ని విషయాలలో మాత్రం చాలా వేగంగా స్పందిస్తుంది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ తీసుకున్న ఓ నిర్ణయం కూడా అలాగే స్పీడు ఎక్కువై అభాసు పాలైంది. సైలెంట్ గా ఉన్న సీనియర్ నేతని సస్పెండ్ చేసి ఆ నేతతోనే నానా మాటలు అనిపించుకుంది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు జెడ్పీ చైర్మన్ , ఎమ్మెల్యేగా, ఎంపీగా పని చేసిన అనుభవం ఆయనది. గతకొంత కాలంగా పొలిటికల్ గా సైలెంట్ అయిన ఆయన సడన్ గా పొలిటికల్ స్క్రీన్ మీద ఎంట్రీ ఇచ్చాడు. పార్టీ మారుతున్నారన్న ప్రచారంతో రాజకీయ చర్చకు కారణమయ్యాడు ఆదిలాబాద్ మాజీఎంపీ రమేష్ రాథోడ్. టీడీపీ నుంచి జెడ్పీ చైర్మన్,ఎంపీ,ఎమ్మెల్యే వంటి కీలకపదవులు చేపట్టిన రాథోడ్ తెలంగాణా రాష్ట ఆవిర్భావం తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన టీఆర్‌ఎస్ పార్టీ‌లో చేరారు.

టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఖానాపూర్ నియోజకవర్గంలో ఉండటం ఆధిపత్యపోరుతో 2018 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖానాపూర్ అసెంబ్లీ నుండి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2019లో ఎంపీగా పోటి చేసి ఓడిపోయారు. వరుస ఓటములను చవిచూసిన ఆయన కొంతకాలంగా రాజకీయంగా సైలెంటయ్యారు. ఇటీవల ఆయన పార్టీ మారుతున్నారని, బీజేపీలో చేరబోతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ క్రమశిక్షణ సంఘం కనీసం వివరణ కోరకుండా రమేష్ రాథోడ్ పై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లుగా ప్రకటించింది.

ఇప్పుడు ఈ ప్రకటనే కాంగ్రెస్ పార్టీని అభాసుపాలు చేసింది. దీని పై స్పందించిన మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ తాను ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ గురించి కానీ, నేతల గురించి కానీ తప్పుగా మాట్లాడలేదని కనీసం ఎన్నికల్లో ఓడిన తర్వాత కూడా ఏ నేత పలకరించలేదని జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఆ అభ్యర్థి టీఆర్‌ఎస్‌కు వత్తాసు పలికితే పార్టీ నుంచి కనీసం విచారణ చేసి సమీక్ష జరపలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీలో అసలు తనకు సభ్యత్వమే లేదని, షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు. ఇటీవలే తాను వివేకానంద, శివాజీ జయంతి వేడుకల్లో, జాతీ పండుగ వేడుకల్లో పాల్గొన్న కారణం చూపి సస్పెండ్ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి క్రమశిక్షణ లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరి దారిన వారు నడుచుకుంటూ కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు.

ఈ సంఘటనతో నిర్ణయాలు త్వరిత గతిన తీసుకోవల్సిన చోట తాత్సారం చేసి అవసరం లేని చోట అతి వేగంతో నిర్ణయాలు తీసుకుని కాంగ్రెస్ పార్టీ మరో తప్పిదం చేసిందా అన్న చర్చ పార్టీనాయకుల్లో వినిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version