ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మళ్లీ రోడ్డున పడ్డ టీఆర్ఎస్ నేతల విభేదాలు

-

ఉమ్మడి రంగా రెడ్డి జిల్లా టీఆర్ఎస్ నేతల గ్రూప్ రాజకీయాలు రోడ్డున పడుతున్నాయి. ఒకవైపు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి,ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మధ్య గ్రూప్ వార్ నడుస్తుండగా ఇప్పుడు మరో వివాదం మొదలైంది. వర్గాలుగా విడిపోయిన నేతలు ఒకరి పై ఒకరు పై చెయ్యి సాధించేందుకు ఆధిపత్యపోరుతో రోడ్డెక్కుతున్నారు. తాజాగా వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్,మున్సిపల్ చైర్మన్ విభేదాలు కౌన్సిల్‌ మీటింగ్‌ సాక్షిగా భగ్గుమన్నాయి.


వికారాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ మధ్య వర్గపోరుతో సతమతమవుతున్న టీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలు వర్సెస్ మున్సిపల్ చైర్మన్లు మధ్య మొదలైన విభేదాలు టెన్షన్ పెడుతున్నాయి. వికారాబాద్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌, ఛైర్‌పర్సన్‌ చిగుళ్లపల్లి మంజుల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. కౌన్సిల్‌ మీటింగ్‌కు ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లతోపాటు టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు రాలేదు. కౌన్సిల్‌ అజెండాలో లేఅవుట్‌ అంశం వీరి మధ్య చిచ్చురాజేసినట్లు తెలుస్తుంది. ఛైర్‌పర్సన్‌కు, ఎమ్మెల్యేకు మధ్య కోల్డ్‌వార్‌ కారణంగానే టీఆర్ఎస్ కౌన్సిలర్లు అంతా కలిసి గైర్హాజరైనట్టు చెబుతున్నారు.

జిల్లాలోని మరో మున్సిపాలిటీ తాండూరులో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ తాటికొండ స్వప్న దొంగ ఓటు వేశారని ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లు ఆందోళన నిర్వహించారు. మున్సిపల్ సమావేశానికి హాజరైన కలెక్టర్ పౌసుమి బసు వాహనానికి కౌన్సిలర్లు అడ్డుతగిలి చైర్‌పర్సన్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. తాటికొండ స్వప్న ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వర్గం కావడంతో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వర్గానికి చెందిన కౌన్సిలర్లు, విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారని చెబుతున్నారు. ఆ తర్వాత మున్సిపల్ సమావేశం జరుగకుండా పదేపదే కౌన్సిలర్లు అడ్డు తగిలారు.

జిల్లాలో ఎమ్మెల్యే వర్సెస్‌ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్ల గొడవ మంత్రి సబితాఇంద్రారెడ్డి వద్దకు వెళ్లినట్టు తెలుస్తోంది. జిల్లాలోని రెండు పురపాలక సంఘాల్లో నెలకొన్న ఆధిపత్య పోరుకు మంత్రి సబితా ఎలాంటి పరిష్కారం చూపిస్తారా అని ఎదురుచూస్తున్నాయి జిల్లా టీఆర్ఎస్ శ్రేణులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version