అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనకారులు ఆందోళనలు చేస్తున్నారు. ఇటీవల తెలంగాణలో కూడా అల్లర్లు జరిగాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీజేపీ, టీఆర్ఎస్ నేతలు ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుతున్నారు. తాజాగా ఈ విషయంపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఘాటుగా స్పందించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనపై అధికార పార్టీ హస్తం ఉందని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించిన తీరు బాధాకరంగా ఉందని ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఉమ్మడి నల్గొండ జిల్లా బీజేపీ శక్తి కేంద్రాల ఇన్‌చార్జ్ ల కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. అధికార పార్టీ డబ్బులిచ్చి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం సృష్టించిందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని టీఆర్ఎస్ కావాలనే యువతను రెచ్చగొడుతోందన్నారు. దేశానికి సేవ చేయాలని అనుకునే వారు ఇలాంటి మాటలు నమ్మి తప్పుదోవ పట్టొద్దని ఎమ్మెల్యే సూచించారు.