ఆందోల్ నియోజకవర్గం తాలెల్మా గ్రామ శివారులో శ్రీ రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ… బీజేపీ వాళ్లు గాంధీని చంపిన గాడ్సేను కూడా వీరుడు అంటారని మండిపడ్డారు. గాంధీని కించపరిచిన వాళ్లు బీజేపీ లోనే ఉన్నారని అన్నారు. అగ్నిపథ్ పేరుతో బీజేపీ ఇవాళ దేశంలో అగ్గి రాజేసింది అన్నారు.
యువతను బీజేపీ రెచ్చగొడుతోందని.. కాల్చుతాం, కేసులు పెడతామని బెదిరిస్తున్నారన్నారు. దేశానికి సేవ చేసే సైనికులకు ఇస్త్రీ, కటింగ్ చేయించడం నేర్పుతామన్న వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి సమాధానం ఇవ్వాలని అన్నారు. కాంగ్రెస్ బిజెపి పార్టీలు తెలంగాణా అభివృద్ధికి నిరోధకంగా తయారయ్యాయని మండిపడ్డారు. బిజెపి ఒక్క ప్రాజెక్టుకు సాయం చేయడం లేదు.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకుంటుందన్నారు.
కర్ణాటకలోని ఎగువ భద్ర కు జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చారు, బుందేల్ ఖండ్ లో కేన్ బెత్వా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు, ఏపీ లోని పోలవరానికి ఇచ్చారు, మన కాళేశ్వరానికో, పాలమూరు ప్రాజెక్టుకో అడిగితే మాత్రం కేంద్రం మొండిచేయి చూపించిందని మండిపడ్డారు. మన రాష్ట్ర అభివృద్ధి ని మనమే చేసుకుంటున్నామని తెలిపారు. బిజెపి ఎనిమిది ఏళ్ల పాలనలో ఒక్కటైనా మంచి పని చేసిందా అని ప్రశ్నించారు హరీష్ రావు.