దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లో రెండు సానుభూతి అస్త్రాలు..ఏ అస్త్రం గెలుస్తుందో..!

-

తెలంగాణ‌లో దుబ్బాక అసెంబ్లీ నియోజ‌క‌వర్గానికి జ‌రుగుతోన్న ఉప ఎన్నిక సెంటిమెంట్‌, సానుభూతి అస్త్రాల యుద్ధంగా మారింది. ఇక్క‌డ నుంచి టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి మృతితో ఉప ఎన్నిక జ‌రుగుతోంది. వాస్త‌వంగా చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే మృతి చెంద‌డం, అక్క‌డ నుంచి ఆయ‌న భార్యే స్వ‌యంగా పోటీలో ఉండ‌డం.. పైగా అధికార పార్టీ కావ‌డంతో ఆ పార్టీకి తిరుగు ఉండ‌ద‌నే అనుకుంటారు. అయితే ఇక్క‌డ కేవ‌లం టీఆర్ఎస్‌కు మాత్ర‌మే సానుభూతి కాదు.. విప‌క్ష కాంగ్రెస్ పార్టీకి కూడా సానుభూతి ఎక్కువ‌గానే క‌నిపిస్తోంది.

గ‌తంలో ర‌ద్ద‌యిన దొమ్మాట‌, ఇప్పుడు దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గాల నుంచి మాజీ మంత్రి, వివాద ర‌హితుడు చెర‌కు ముత్యంరెడ్డి సైతం నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెల‌వ‌డంతో పాటు మంత్రిగా కూడా ప‌నిచేశారు. ముత్యంరెడ్డి హ‌యాంలో కూడా నియోజ‌క‌వ‌ర్గంలో ఎంతో అభివృద్ధి జ‌రిగింది. పైగా ఆయ‌న పెద్దాయ‌న‌గా పేరు తెచ్చుకున్నారు. వివాదాల‌కు దూరంగా అంద‌రిని క‌లుపుకుపోయే వ్య‌క్తిగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయ‌న మృతితో ఆయ‌న త‌న‌యుడు శ్రీనివాస్‌రెడ్డికి టీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ నిరాక‌రించ‌డం, ఆయ‌న  త‌న‌యుడు స్వ‌యంగా పోటీలో ఉండ‌డంతో ఇది కూడా సానుభూతిగానే మారుతోంది.

సోలిపేట రామలింగారెడ్డి తెలంగాణ ఉద్య‌మంలో ముందునుంచి పాల్గొన్నారు. 2004 సాధారణ ఎన్నికల్లో, 2008 ఉప ఎన్నికల్లో రాష్ట్ర సాధన తర్వాత జరిగిన 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించారు. ఇప్పుడు ఆయ‌న భార్య సుజాత పోటీలో ఉండ‌డంతో పాటు ఆమె త‌న భ‌ర్త ల‌క్ష్యాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ప్ర‌చారం చేస్తున్నారు. ఇక ముత్యంరెడ్డి 1989, 1994, 1999తో పాటు 2009 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డంతో పాటు రాష్ట్ర మార్కెటింగ్, సహకార శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. టీఆర్ఎస్‌లో చేరిన‌ప్పుడు ఆయ‌న‌కు మంచి ప‌ద‌వి ఇస్తామ‌ని పార్టీలో చేర్చుకున్నారు.. ఇప్పుడు ఆయ‌న మృతి త‌ర్వాత ఆయ‌న త‌న‌యుడి ఎమ్మెల్యే సీటు అడిగినా టీఆర్ఎస్ అధిష్టానం ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న ప్ర‌చాచారాన్ని ముత్యంరెడ్డి అనుచ‌రులు బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్ల‌డంతో పాటు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తోన్న శ్రీనివాస్‌రెడ్డికే ఓటేయాల‌ని సూచిస్తున్నారు.

బీజేపీకి కూడా సానుభూతి ఉందే….

టీఆర్ఎస్‌, కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌కే కాదు.. బీజేపీ నుంచి పోటీ చేస్తోన్న ర‌ఘునంద‌న్‌రావుకు సైతం ఇక్క‌డ సానుభూతి బాగానే ఉంది. తెలంగాణ ఉద్య‌మంలో టీఆర్ఎస్ పార్టీలో ఎంతో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న ఆ త‌ర్వాత బీజేపీలో చేరారు. 2014, 2018 ఎన్నిక‌ల్లో దుబ్బాక నుంచి పోటీ చేసి ఓడిన ఆయ‌న 2019 ఎన్నిక‌ల్లో మెద‌క్ ఎంపీగా కూడా ఓడిపోయారు. ఇప్పుడు మూడోసారి మ‌ళ్లీ దుబ్బాక‌లో పోటీ చేస్తుండ‌డంతో ఆయ‌న‌కు కూడా ఇక్క‌డ‌
సానుభూతి ఉంది. అయితే ర‌ఘునంద‌న్ గెలుపు ఎలా ఉన్నా గ‌తం కంటే ఎక్కువ ఓట్లు వ‌స్తాయ‌ని ఆశిస్తున్నారు. మ‌రి కాంగ్రెస్ వ‌ర్సెస్ టీఆర్ఎస్ సానుభూతి పోరులో గెలుపు ఎవ‌రిది అవుతుందో ?  చూడాలి.

-vuyyuru subhash 

Read more RELATED
Recommended to you

Exit mobile version