ఇటీవల తెలంగాణ విద్యాశాఖ ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఇంటర్ ఫలితాలలో ఫెయిల్ అయిన విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు నెల వ్యవధిలోనే ఇంటర్ బోర్డు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో.. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ షెడ్యూల్‌ను తెలంగాణ ఇంటర్ బోర్డు బుధవారం విడుదల చేసింది. ఆగస్ట్ 1 నుంచి 10వ తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్ష నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది.
ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యుస్ పరీక్ష జూలై 27న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్‌ను జూలై 23న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 10 గంటల వరకు నిర్వహించనున్నట్లు బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. మంగళవారం ఇంటర్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. 63.32శాతం ఉత్తీర్ణత నమోదైంది.