ఈ మధ్యనే తెలంగాణ సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కశాశాలలో లెక్చరర్ల పోస్టలకు అర్హత సాధించడం కోసం ఉస్మానియా యూనివర్సిటీ ఈ ఏడాది ఈ పరీక్షను నిర్వహిస్తోంది. ఇందు కోసం ఆగస్టు 5న దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. కాగా ఈ పరీక్షలకు అప్లై చేసుకునే చివరి తేదీ నిన్నటితో ముగిసింది. ఈ క్రమంలో అధికారులు తాజాగా దరఖాస్తుల గడువును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
టీఎస్ సెట్ దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 29తో ముగియగా, అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు దరఖాస్తు గడువును సెప్టెంబర్ 4వ తేదీ వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. రూ. 1500 ఆలస్య రుసుంతో సెప్టెంబర్ 10వ తేదీ వరకు, రూ. 2 వేల ఆలస్య రుసుంతో సెప్టెంబర్ 18 వరకు, రూ. 3 వేల ఆలస్య రుసుంతో సెప్టెంబర్ 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు ఆలస్య రుసుంకు అదనం. సెప్టెంబర్ 26, 27 తేదీల్లో దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
అక్టోబర్ 20 నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 28, 29, 30 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, విజయవాడ, హైదరాబాద్, వరంగల్, కర్నూల్, కరీంనగర్, తిరుపతి, మహబూబ్‌నగర్, మెదక్, వైజాగ్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. దరఖాస్తుల కోసం www.telanganaset.org అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.