శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్తను చెప్పింది. ఈ ఫిబ్రవరి మాసానికి సంబంధించిన అంగ ప్రదక్షిణం టోకెన్లను మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. శ్రీవారి ఆలయంలో బాలాలయం కారణంగా ఫిబ్రవరి 22 నుంచి 28వ తేదీ వరకు అంగ ప్రదిక్షణ టోకెన్ల జారీని నిలిపివేసినట్లు తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరింది. ఇదిలా ఉండగా.. శ్రీవారి ఆలయానికి భక్తుల రద్దీ కొనసాగుతున్నది. నిన్న ఒకే రోజు 72,998 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 24,852 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీల ద్వారా రూ.4.51కోట్ల ఆదాయం సమకూరింది. అంగప్రదక్షిణ చేయాలనుకునే భక్తులు.. రాత్రి 12 గంటల సమయంలో శ్రీవారి పుష్కరిణిలో ఒంటిమీద బట్టలతోనే మూడు మునకలు వేసి.. తడి బట్టలతో వైకుంఠం మొదటి క్యూ కాంప్లెక్స్ స్పెషల్ ఎంట్రీ దర్శనం క్యూ ద్వారా వెళ్లాలి.
అక్కడ రిపోర్టింగ్ సమయం.. రాత్రి ఒంటి గంట కాబట్టి.. ఆ సమయానికే క్యూ లైన్ దగ్గరకు చేరుకోవాలి. అక్కడికి చేరుకున్న తరువాత బుకింగ్ టికెట్, ఐడిని సెక్యూరిటీ సిబ్బందికి చూపించాల్సి ఉంటుంది. మీరు పొందిన టోకెన్ తో పాటు ఐడీ సరిపోతే.. భక్తులను ఆలయం లోపలి అనుమతిస్తారు. అక్కడి నుంచి స్త్రీ, పురుషులకు వేర్వేరు వెయిటింగ్ హాల్లోకి ప్రవేశం కల్పిస్తారు. శ్రీవారికి సుప్రభాత సేవ మొదలైన తరవాత.. భక్తులను అంగప్రదక్షిణకు అనుమతిస్తారు. తెల్లవారు జామున 2 గంటల 45 నిమిషాలకు మొదట స్త్రీలను పంపుతారు. ఆ తరువాత పురుషులకు అనుమతి ఉంటుంది. సుప్రభాతం జరుగుతున్న సమయంలోనే స్త్రీలకు అంగప్రదక్షిణ పూర్తి అవుతుంది.