తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. రెండేళ్ల తర్వాత బ్రహ్మోత్సవాలు భక్తుల సమక్షంలో జరగనుండటంతో, ఈసారి భక్తులు భారీగా తరలి వస్తారని భావిస్తోంది టీటీడీ. అందుకే నిఘా, భద్రత విభాగం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసింది. తిరుమలకు వెళ్లే అన్ని వాహనాలు 12వేలు దాటిన తర్వాత అనుమతించకూడదని నిర్ణయం తీసుకుంది.
మిగిలిన వాహనాలను తిరుపతిలోని పార్కింగ్ ప్రాంతాల్లో నిలిపివేయాలని, అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుమలకు రావాలని సూచించారు అధికారులు. అలాగే ఏటా గరుడ వాహన సేవ రోజు ఉదయం నుంచి మరుసటి రోజు వరకు ఘాటు రోడ్డులో బైకులు అనుమతించరు. ఈ ఏడాది గరుడ సేవ వచ్చేనెల 1న కాగా, ఈనెల 30 మధ్యాహ్నం 12 గంటల నుంచి అక్టోబర్ 2 వరకు ద్విచక్ర వాహనాలను ఘాటు రోడ్డులో అనుమతి ఉండదు. భక్తులు ఈ మార్పుల్ని గమనించి సహకరించాలని టిటిడి సూచిస్తుంది.