అమరావతి భూ కుంభకోణం కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడకు చెందిన గుమ్మడి సురేష్, తుళ్లూరు రిటైర్డ్ తహసిల్దార్ సుధీర్ బాబును అరెస్ట్ చేశారు. వీరిద్దరిని బుధవారం పోలీసులు మంగళగిరి కోర్టుకు హజరుపరిచారు. వీరికి ఈనెల 29 వరకు కోర్టు రిమాండ్ విధించింది. కాగా అసైన్డ్ భూములను నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేశాడంటూ సురేశ్‌పై, భూ రికార్డులు తారుమారు చేసినట్లు సుధీర్‌పై ఆరోపనులున్నాయి. కాగా, ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక అమరావతి భూములపై ప్రత్యేక దృష్టిపెట్టింది.
చంద్రబాబు నాయుడు హయాంలో ఎన్నో అక్రమాలు జరిగాయని.. వాటిని బయటపెట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో రాజధాని భూములపై సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ క్రమంలోనే ఏపీ సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ మాధురిని కొద్ది రోజుల క్రితం ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్ట్ చేసింది. 2016లో రాజధాని ప్రాంతంలోని రావెల గోపాల కృష్ణ అనే వ్యక్తికి ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆమెపై ఆరోపణలున్నాయి. అక్రమంగా భూములను బదలాయించినట్లు దర్యాప్తులో తేలడంతో మాధురిని అరెస్ట్ చేశారు.