కరోనా లాక్‌డౌన్ వల్ల అన్ని రంగాలతోపాటు ఆటో మొబైల్ రంగం కూడా భారీగా నష్టపోయింది. అయితే మే మధ్య నుంచి లాక్‌డౌన్ ఆంక్షలను సడలించడంతో ఆ రంగం కొంత వరకు పుంజుకుంది. ఇప్పటికే అనేక కంపెనీలు మళ్లీ వాహనాల తయారీని పునః ప్రారంభించాయి. అయితే టూవీలర్ల కంపెనీలు మాత్రం ఉత్పత్తిని మరింతగా పెంచాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే చాలా మంది ప్రస్తుతం ప్రజా రవాణా అంటే భయపడి సొంత వాహనాలకే మొగ్గు చూపుతున్నారు. అందులోనూ టూవీలర్లను కొనేందుకే చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఆయా కంపెనీలు వేగంగా ఉత్పత్తిని పెంచే పనిలో పడ్డాయి.
ఇప్పటికే అనేక టూవీలర్ తయారీ కంపెనీల్లో ఉత్పత్తి సాధారణ స్థితికి చేరుకుంటోంది. లాక్‌డౌన్ ఆంక్షలను సడలించాక 70 శాతం ఉత్పత్తిని తాము తిరిగి సాధించామని, ఈ నెల చివరి వరకు ఉత్పత్తి 90 శాతం వరకు చేరుకుని ఆ తరువాత సాధారణ స్థితికి వస్తుందని అంటున్నాయి. జూలై నెల వరకు వాహనాల ఉత్పత్తి సాధారణ స్థితికి చేరుకుంటుందని అంటున్నారు. దీంతో కస్టమర్ల డిమాండ్ మేరకు వాహనాలను సప్లయి చేస్తామంటున్నాయి. కాగా ఫిబ్రవరి నెలలో మొత్తం 1.60 మిలియన్ల టూవీలర్లను ఉత్పత్తి చేయగా.. జూన్ 1 నుంచి ఇప్పటి వరకు 1 మిలియన్ వాహనాలను ఉత్పత్తి చేశారు. ఈ క్రమంలో నెలాఖరు వరకు ఫిబ్రవరి ఉత్పత్తి శాతాన్ని అందుకుంటామని వాహన తయారీ కంపెనీలు చెబుతున్నాయి.
ఇక కార్ల కన్నా వాహనదారులు టూవీలర్లను కొనేందుకే ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తున్నారు. అయితే పట్టణాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లోనే ముందుగా ఆంక్షలను సడలించడంతో అక్కడ టూవీలర్ల అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ నెమ్మదిగా అన్ని ప్రాంతాల్లోనూ ఆ అమ్మకాల సంఖ్య పెరుగుతుందని ఆయా కంపెనీలు చెబుతున్నాయి. కరోనాకు ముందు ఉన్న పరిస్థితికి మరో నెల రోజుల్లో చేరుకుంటామని వాహనతయారీ కంపెనీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజలు కరోనా నేపథ్యంలో ప్రజా రవాణాను ఎక్కువగా ఆశ్రయించడం లేదని, కనుకనే సొంత వాహనాల్లో వెళ్తున్నారని, ఇక అందుకనే సేల్స్ కూడా పెరిగాయని ఆయా కంపెనీలు చెబుతున్నాయి. మరి ముందు ముందు మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.