రష్యా దాడులతో సర్వనాశనమైన ఉక్రెయిన్‌కు వరుస సంక్షోభాలు వెంటాడుతున్నాయనే చెప్పుకోవచ్చు. మరియాపోల్, ఖేర్సన్ నగరాల్లో ఎటూ చూసినా కుళ్లిన శవాలే దర్శనమిస్తున్నాయి. అపరిశుభ్రమైన వాతావరణం, కలుషిత నీరు, కుళ్లిన శవాల కారణంగా కలరా వ్యాప్తి అధికంగా ఉంది. మరియాపోల్‌లో వందలాది కలరా కేసులు గుర్తించినట్లు అధికారులు ప్రకటించారు. కుళ్లిన శవాల చుట్టూ ఈగలు, బొద్దింకలు, కీటకాలు ఎక్కువగా ఉండటం.. వాటి ద్వారా కలరా వ్యాప్తి వేగంగా విజృంభిస్తోందని అధికారులు పేర్కొన్నారు. మరికొద్ది రోజుల్లో ఈ వ్యాప్తి అధికమవుతుందని పేర్కొన్నారు.
ఇప్పటికే రష్యా దాడుల్లో చాలా మంది కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. తాజాగా కలరా వ్యాప్తి ఉక్రెయిన్ వాసులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ ఘటనపై ఐక్యరాజ్య సమితి కూడా స్పందించింది. గత నెల రోజులుగా పలు కలరా కేసులు గుర్తించినట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. అలాగే చాలా అంటువ్యాధులు ప్రబలుతున్నట్లు గుర్తించారు. ఈ వార్తలను రష్యా ప్రభుత్వం తోసి పుచ్చడానికి ప్రయత్నిస్తోంది. ఇదంతా ఉక్రెయిన్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారమని, మరియాపోల్‌లో ఒక్క కలరా కేసు నమోదు కాలేదని తెలిపింది.