కరోనాను అవకాశంగా ఉపయోగించుకుని భారత్‌పై దాడిచేయాలని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ భారతీయ ముస్లింలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు తన ఆన్‌లైన్ మ్యాగజైన్ ‘వాయిస్ ఆఫ్ హింద్’లో పేర్కొంది. దీని కవర్ పేజీపై ఢిల్లీలోని మర్కజ్ కార్యక్రమానికి హాజరైన వారి ఫొటోతో పాటు ఢిల్లీ అలర్ల ఫొటోలను ముద్రించింది. అల్లాను నమ్మని వారిని హతమార్చాలంటూ ఓ పదిహేడు పేజీల కథనాన్ని భారత్‌కు వ్యతిరేకంగా ప్రచురించినట్లు తెలుస్తోంది.
ఐసిస్ సభ్యులు కేరళ, కర్ణాటకలో పెద్ద సంఖ్యలో తిష్ఠ వేశారని పేర్కొంది. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, మయన్మార్‌లో ఎక్యూఐఎస్ సభ్యులు 150-200 మంది ఉండొచ్చని తెలిపింది. ఈ ప్రాంతంలో దాడులకు కుట్రలు పన్నుతున్నారని హెచ్చరించింది. అలాగే ఐసిస్‌కు చెందిన భారత అనుబంధ ముఠా (హింద్ విలాయాహ్)లో 180 నుంచి 200 మంది సభ్యులు ఉన్నారు. భారత్‌లో కొత్తగా ఒక ‘ప్రావిన్స్’ను ఏర్పాటు చేసినట్లు గత ఏడాది మేలో ఐసిస్ పేర్కొంది.