దివీస్ ఫ్యాక్టరీ చుట్టూ ఏపీ రాజకీయం..ఆసక్తి రేపుతున్నపవన్ పర్యటన

-

దివీస్ ఫ్యాక్టరీ చుట్టూ రాజకీయం వేడెక్కుతోంది… అధికారంలో ఉండగా దివిస్ కి అనుమతులు ఇచ్చిన తెలుగుదేశం, ఇప్పుడు దివిస్ డ్రగ్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది ..ప్రతిపక్షంలో ఉండగా దివిస్ కి వ్యతిరేకంగా ప్రకటన చేసిన వైసిపి ఇప్పుడు అనుమతులు ఇచ్చింది. ఇక బీజేపీ తో కలసి దివిస్ పై పోరాటంలోకి దిగాలని జనసేన భావిస్తోంది…ఇక కొత్త సంవత్సరంలో దివీస్ నుంచే పోరాటాన్ని మొదలుపెట్టనున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్.

దివీస్‌ ఫ్యాక్టరీకి ఏపీ సర్కార్‌ మరో 200ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయిస్తూ అనుమతులు ఇవ్వడం రాజకీయ దుమారం రేపుతుంది . అప్పట్లో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా మాట్లాడిన జగన్‌.. ఇప్పుడు సీఎం అయ్యాక అదే ఫ్యాక్టరీ ఏర్పాటుకు అదనంగా ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడంపై స్థానిక రైతులు మండిపడుతున్నారు. మరోవైపు దివీస్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు,, మత్స్యకారులు, గ్రామస్తులు సృష్టించిన విధ్వంసంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే 166మంది గ్రామస్తులపై కేసులు నమోదు చేశారు. దీంతో పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించాయి విపక్ష రాజకీయ పార్టీలు.

ఇక ఈ ప్రాంతంలో టీడీపీ, వైసీపీల మీదున్న వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది జనసేన. బీజేపీతో కలిసి ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉద్యమించాలని స్కెచ్‌ వేస్తోంది. ఇప్పటికే ఆపార్టీ నేతలు పర్యటనలు జరిపి మద్దతు తెలిపారు. జైలుకు వెళ్లి రైతులు మత్స్యకారుల్ని పరామర్శించారు. అంతేకాదు…10రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే ఉద్యమం చేస్తామని పవన్ ప్రకటించారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఆందోళనకారులు పదిరోజుల క్రితం ఉన్నపళంగా ఫ్యాక్టరీ కి కేటాయించిన స్థలంలో చొరబడి నిర్మాణ సామాగ్రి తోపాటు కంపెనీకి చెందిన నిర్మాణాలను ధ్వంసం చేయడం, వాటిని తగలబెట్టడం సంచలనం సృష్టించింది.

దీంతో కొత్త సంవత్సరం జనవరి మొదటి వారంలో దివీస్ వేదికగానే పవన్ పర్యటన ప్రారంభించబోతున్నారు. మొత్తంమీద… దివీస్‌ ఎపిసోడ్‌తో తొండంగి నివురుగప్పిన నిప్పులా మారింది. ముందుముందు ఏంజరుగుతుంది..ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version