ఏపీ అప్పులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మాజీ ఎం.పి. ఉండవల్లి అరుణ్ కుమార్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటికే రూ. 6 లక్షల కోట్లు అప్పు ఉందని.. రాష్ట్రంలో 40 శాతం విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయింది… విద్యుత్ కోతలు మొదలయ్యాయని జగన్ సర్కార్ పై ఫైర్ అయ్యారు. పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా నీటిని ఎలా నిల్వ చేస్తారు ? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటి? అని నిలదీశారు. జి.వో.లు వెబ్ సైట్ లో పెట్టకుండా పారదర్శకత పాటించడంలేదని.. పోలవరం పేరుతో రూ. 71, 761 కోట్లు అప్పులు తెచ్చారని తెలిపారు.
వన్ రేషన్- వన్ రేషన్ కార్డు ఉన్నంతకాలం పంచేద్దాం, తరువాత చేతు ఎత్తేదాం అనే ఆలోచనలో ఉన్నారా ? అని చురకలు అంటించారు. దారుణంగా రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారని ప్రతిపక్షాలంటే.. ఎందుకు వైసిపి నేతలు ఖండించరు ? మద్యం అమ్మకాలు మీద వచ్చిన ఆదాయం నేరుగా రుణాలు చెల్లించే విధంగా చేశారన్నారు. ఆంధ్ర రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఎక్కడ దొరికితే అక్కడ అప్పు చేసే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్ లు బకాయిలు పెరిపోయాయని.. ఆస్తులు తాకట్టు పెడితే కానీ అప్పు దొరకని పరిస్థితి ఉందని వైసీపీ సర్కార్ పై మండిపడ్డారు. అప్పులపై ప్రజలకు ధైర్యం కలిగేలా శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు.