కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాన్వాయ్ ని ఆప్ నేతలు సోమవారం నాడు హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద అడ్డుకున్నారు. దీంతో కలెక్టరేట్ వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. సోమవారం నాడు పెట్రోల్, డీజిల్ తో పాటు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని కోరుతూ హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు ఆప్ కార్యకర్తలు. అయితే హైదరాబాద్ కలెక్టరేట్లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం నాడు కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు.
అయితే సమావేశం ముగించుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బయటకు వెళ్లిపోతున్న సమయంలో కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగిన ఆప్ కార్యకర్తలు కిషన్ రెడ్డి కాన్వాయ్ కి అడ్డు పడ్డారు. కాన్వాయ్ ముందుకు వెళ్లకుండా రోడ్డుపై బైఠాయించారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. మంత్రి వెంట ఉన్న బిజెపి కార్యకర్తలు ఆప్ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించి మంత్రి కిషన్ రెడ్డి కాన్వాయ్ ముందుకు పంపించారు పోలీసులు.