ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తికి నిర్వచనంగా హెచ్ఏఎల్, విమానయాన శాఖ నిలవడంపై పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. స్వదేశీ పరిజ్ఞానంతోనే అత్యాధునిక యుద్ధ విమానాలు తయారు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. బెంగళూరులో ప్రతిష్టాత్మకమైన ఏరో ఇండియా-2025 ప్రదర్శనలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హెచ్ జేటీ-36 యశస్ యుద్ధ విమానంలో ఆయన ప్రయాణించారు.
అనంతరం మాట్లాడుతూ… యుద్ధ విమానాన్ని నడపడం మరచిపోలేని అనుభూతినిచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. హెచ్ఏఎల్ స్వదేశంలో సగర్వంగా తయారు చేసిన హెచ్ జేటీ-36 ‘యశస్’ అనే అద్భుతమైన జెట్ విమానంలో ప్రయాణించే అరుదైన అవకాశం లభించిందన్నారు. విమానయాన, రక్షణ తయారీలో రోజురోజుకూ పెరుగుతున్న పరాక్రమానికి ఈ స్వదేశీ అద్భుతం నిదర్శనమని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ గారి ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త శిఖరాలకు చేరుకోవడం ఆనందంగా ఉందని వివరించారు.