ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ నెల రోజుల కిందట భారత్‌లోని యూజర్లకు వాట్సాప్ పే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం విదితమే. వాట్సాప్‌లోని యూజర్లు అందులోనే ఇతరులకు నగదును పంపుకునేందుకు, బిల్లులను చెల్లించేందుకు ఆ ఫీచర్ వీలు కల్పిస్తుంది. అయితే నెల రోజులు గడిచినా ఆ ఫీచర్ కు యూజర్ల నుంచి అంతంతమాత్రంగానే స్పందన లభిస్తోంది. ఆ ఫీచర్‌కు అంతగా ఆదరణ లభించడం లేదు. అయితే ఇందుకు కారణాలూ లేకపోలేదు.
వాట్సాప్ కు భారత్‌లో 40 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. అయితే వాట్సాప్ పే ఫీచర్‌ను కేవలం 30 శాతం మంది యూజర్లకు మాత్రమే తొలి దశలో అందించాలని ఎన్‌పీసీఐ నియమం పెట్టింది. దీంతో యూజర్లు అక్కడే నిరాశకు గురయ్యారు. అలాగే ప్రస్తుతం గూగుల్ పే, ఫోన్ పేలు డిజిటల్ చెల్లింపుల యాప్‌లలో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఎక్కువగా ఈ రెండు యాప్‌లనే జనాలు వాడుతున్నారు. మరోవైపు పేటీఎం, అమెజాన్ పే యాప్‌లను కూడా కొద్దో గొప్పో మంది ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో ఆయా యాప్‌ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. అందువల్ల కూడా వాట్సాప్ కు ఆదరణ లభించడం లేదు.
గూగుల్ పే, ఫోన్ పేలలో నెల నెలా 8.5 కోట్లు, 8.3 కోట్ల ట్రాన్సాక్షన్లు జరుగుతుంటాయి. కానీ వాట్సాప్ పే ఆరంభమై నెల రోజులు గడిచినా అందులో కేవలం 3.10 లక్షల ట్రాన్సాక్షన్లు మాత్రమే జరిగాయి. మొత్తం మంది యూజర్లకు వాట్సాప్ పే సేవలు లభించకపోవడం ఒక కారణం అయితే, ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న డిజిటల్ యాప్‌ల నుంచి గట్టి పోటీ ఉండడం ఇంకో కారణం. అందువల్లే వాట్సాప్ పే కు పెద్దగా ఆదరణ లభించడం లేదు. అయితే వాట్సాప్ పేపై విధించిన 30 శాతం యూజర్ల నిబంధనను ఎత్తివేస్తే ఆ యాప్‌లో కూడా ఆన్‌లైన్ నగదు ట్రాన్స్ ఫర్, పేమెంట్లు ఎక్కువగా జరిగేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మరి ఈ విషయంపై ఎన్‌పీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.