ఎన్నో ఆశలతో గన్నవరం నుంచి వరుసగా రెండోసారి టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యే వంశీ టీడీపీ నుంచి బయటకు వచ్చారు. చంద్రబాబు, లోకేష్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి రెండు సార్లు జగన్‌ను కూడా కలిశారు. టీడీపీకి భవిష్యత్తు లేదంటూనే.. చంద్రబాబు వల్లే తమ్మ కమ్మ వర్గం బద్నాం అవుతోందని తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ మారడంతో పాటు జగన్‌కు దగ్గరవ్వడంతో గన్నవరంలో వైసీపీలో తనకు తిరుగులేదనే వంశీ ముందు నుంచి భావిస్తూ వచ్చారు. గత ఎన్నికల్లో వంశీపై పోటీ చేసి ఓడిన యార్లగడ్డ వెంకట్రావుకు డీసీసీబీ చైర్మన్ పదవి ఇవ్వడంతో వంశీ తనకు తిరుగు ఉండదనే అనుకున్నారు.
వెంకట్రావు కూడా తనకు డీసీసీబీ పదవి ఇవ్వడంతో ఆయన గన్నవరంలో పార్టీ జెండా పీకేసి విజయవాడలో నివాసం ఉంటున్నారు. వంశీ తనకు తిరుగులేదు అనుకుంటోన్న టైంలో ఆయనకు వైసీపీలో మరో బలమైన వర్గం సవాల్ విసురుతోంది. వంశీపై 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు దుట్టా రామచంద్రరావు. ఇప్పుడు దుట్టా అల్లుడు శివభరత్ రెడ్డి గన్నవరం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి వంశీకి వ్యతిరేకంగా ఉన్న వర్గాలను ఒక్కటి చేస్తు్నారు. ఇక నియోజకవర్గంలో అధికారులపై కూడా శివభరత్ రెడ్డి, దుట్టా రామచంద్రరావు కంట్రోలింగ్‌కు దిగారు.
ఈ క్రమంలోనే వంశీ తానకు తానే గన్నవరం ఎమ్మెల్యేతో పాటు వైసీపీ ఇన్‌చార్జ్‌ను కూడా తానే అని ప్రకటించుకున్నారు. వంశీ ఈ ప్రకటన చేసిన వెంటనే దుట్టా రామంచంద్రరావు సైతం త్వరలోనే గన్నవరం ప్రజలకు గుడ్ న్యూస్ వస్తుందని.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ కార్యకర్తలను వేధించుకుని తిన్నవారే ఇప్పుడు కూడా చక్రం తిప్పాలని చూస్తున్నారంటూ పరోక్షంగా వంశీని టార్గెట్ చేశారు. ఇక తాను పార్టీ మారినప్పుడు, చంద్రబాబు, లోకేష్‌ను తిట్టినప్పుడు ఆహ్వానించిన వైసీపీ నేతలు ఇప్పుడు దుట్టా రామచంద్రరావు తనను టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నా మాట్లాడడం లేదన్న ఆవేదన వంశీలో ఉంది.
ఇక ఉప ఎన్నిక జరిగితే గన్నవరం నుంచి తానే పోటీ చేస్తానని దుట్టా ప్రకటన చేయడంతో వైసీపీ రెండు వర్గాలుగా చీలిపోయినట్టే కనిపిస్తోంది. ఈ పరిణామాలపై తీవ్ర ఆవేదనలో ఉన్న వంశీ ఇప్పటికే ఈ విషయాన్ని కొడాలి నాని దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.