వారణాసి కోర్టు శుక్రవారం జ్ఞానవాపి మసీదు కేసులో సంచలన తీర్పు చెప్పింది. మసీదులో లభ్యమైన శివ లింగానికి కార్బన్ డేటింగ్ చేయించాలంటూ పలు హిందూ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌లను కొట్టివేసింది వారణాసి కోర్టు. శివ లింగానికి కార్బన్ డేటింగ్ చేయించేందుకు అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలిపింది వారణాసి కోర్టు. శివ లింగానికి కార్బన్ డేటింగ్ చేయిస్తే… మసీదు కంటే ముందు అక్కడ ఆలయమే ఉందన్న విషయం తేలిపోతుందని భావించిన హిందూ సంఘాలు… శివ లింగానికి కార్బన్ డేటింగ్ చేయించాలంటూ కోర్టును ఆశ్రయించాయి. అయితే కోర్టు అందుకు అంగీకరించలేదు. దీంతో ఈ వ్యవహారంపై హిందూ సంస్థలు ఉన్నత న్యాయ స్థానాలను ఆశ్రయించే దిశగా అడుగులు వేస్తాయా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.
జ్ఞాన్‌వాపి మసీదు వెలుపలి గోడపై ఉన్నదేవతామూర్తులకు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఐదుగురు మహిళలు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారించిన వారణాసి కోర్టు.. మసీదు ప్రాంగణంలో వీడియోగ్రఫీ సర్వే చేసి నివేదిక ఇవ్వాలని కమిషన్‌ను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు మసీదు ప్రాంగణంలో మే 14 నుంచి 16 వరకు కమిషన్ వీడియోగ్రఫీ సర్వే నిర్వహించింది కమిషన్. వీడియోగ్రఫీ సర్వే సందర్భంగా మసీదులోని బావిలో 12.8 అడుగుల పొడవైన శివలింగం కనిపించిందని హిందూ పిటిషనర్లు వారణాసి జిల్లా కోర్టును ఆశ్రయించారు. దీంతో శివలింగం కనిపించిందని చెబుతున్న ప్రాంతాన్ని సీల్ చేయాల్సిందిగా సంబంధిక అధికారులను జడ్జీ ఆదేశించారు. అయితే వీడియో గ్రఫీ తీస్తుండగా అక్కడ కనిపించింది శివలింగం కాదని, అది ఫౌంటెయిన్‌లో భాగమని ముస్లిం పక్ష నేతలు చెప్పారు. దీంతో జ్ఞాననాపి మసీదులో శివలింగం దొరికిందని చెబుతున్న ప్రాంతానికి తగిన రక్షణ కల్పించాలని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముస్లింలు ఆ మసీదులో ప్రార్థనలు కొనసాగించుకోవచ్చని స్పష్టం చేసింది.